జయప్రకాశ్ అంకం

మహిళల్లో ధిక్కారస్వరాన్ని సాధారణంగా పురుషస్వామ్యం అంగీకరించదని, అందుకే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని తారా కౌశల్ తన ‘వై మెన్ రేప్’ పుస్తకంలో పేర్కొన్నారు. అసలు నిజమేంటంటే ఒక దళిత అమ్మాయి ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నించినా, తన మానాన తాను పని చేసుకుంటూ సమాజాన్ని ధిక్కరించినా ఏ ఉన్నత కులస్థుడూ భరించలేడు. చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి కనీసం గ్రామంలోని సదరు వ్యక్తుల ముఖం సైతం చూసి ఎరగదు. ఇక్కడ అణిగిమణిగి ఉండటానికి ఒప్పుకోని ఆమె అస్తిత్వమే వారికి కంటగింపు. దేశంలో ఎక్కడ లైంగిక నేరం జరిగినా దానికి మద్యపానాన్ని, ఇంటర్నెట్‌ను నిందించేందుకు సిద్ధంగా ఉండే సమాజం దళిత మహిళలపై దాష్టీకాలను నిర్వచించడంలో మాత్రం విఫలమైంది. 

దళిత స్త్రీల మీద రోజురోజుకు పెరుగుతున్న అత్యాచారాలు, హింస సమాజంలో వారి స్థానం చుట్టూ ఉన్న విరుద్ధ స్వభావాల విషపు పడగలకు నిదర్శనం. ఈ హింసకు మూలాలు వర్తమానంలో లేవు. ప్రాచీన కాలం నాటి విషపూరిత సంస్కృతికి ఇది ఆనవాలు. ఇక్కడ జరిగే అత్యాచారాలలో అనేకం కులంతో సంబంధం కలిగిఉంటాయి. అత్యాచారంలో బాధిత స్త్రీపై వివక్షాపూరితమైన కసిని చూపించడం కనిపిస్తుంది. అలాంటి హింసకు పరాకాష్ఠ హాథ్రాస్ గ్యాంగ్‌రేప్. ఈ కేసులో 19 ఏళ్ల దళిత మహిళ కేవలం కులం కారణంగానే అత్యాచారంతో పాటు క్రూరమైన హింసకు కూడా గురైందని స్పష్టంగా తెలుస్తోంది. ఆధిపత్య ధోరణి గల ఉన్నత కులాలు ఆది నుంచీ దళిత మహిళల మీద ఈ అత్యాచార పరంపరను కొనసాగిస్తున్నాయి. ఇది భారతీయ సమాజంలో పాతుకుపోయిన సాంస్కృతిక రుగ్మత. పురాతన పురుషాధిపత్య సమాజం ఇప్పటికీ దేశంలో దాదాపు ప్రతిచోటా ప్రభావవంతంగా ఉంది. కాబట్టి ఈ నేరాలు దాదాపు ప్రతిసారీ కులం కోణాన్ని కలిగి ఉంటాయి. కులవ్యవస్థ గల సమాజం సహజంగానే హింసాత్మకంగా ఉంటుంది.

దేశంలో సంచలనం సృష్టించిన ఫిజియోథెరపీ విద్యార్థిని నిర్భయ సంఘటన జరిగిన రోజున అత్యాచారాల సంఖ్యను పరిశీలిస్తే ఆ రోజు దేశవ్యాప్తంగా నమోదైన 68మంది బాధితులలో ఆమె కూడా ఒకరు. మీడియా ఆమెను పట్టణ భారతదేశంలో నివసిస్తున్న మహిళగా చిత్రీకరించింది. ఆమె దళిత లేదా గిరిజన మహిళ కాదు. ఈ తేడాలే స్పందనలో స్పష్టంగా విభజన రేఖను సృష్టించాయి. ఇవే భారతీయ మధ్యతరగతి సమాజం నుంచి భారీస్థాయిలో స్పందనకు కారణమయ్యాయి. నిర్భయపై జరిగిన అమానుషాన్ని అందరూ ఖండించాల్సిందే. అదే సమయంలో దేశ మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న కీచకపర్వాల సంగతేంటని ప్రశ్నించడం ఇప్పటి సామాజిక ఆవశ్యకత. వాస్తవానికి భారతీయ స్త్రీలు వారి లింగం కన్న కులంతోనే ఎక్కువగా గుర్తించబడ్డారు. ఇది వారి పట్ల జరిగే దోపిడికి, అణచివేతకు ఒక కారణమయింది. భారతదేశంలో 6వేలకు పైగా కులాలు, ఉపకులాలు ఉన్నాయి. వీటిలో 3,743 కులాలు సామాజిక వివక్ష, విద్యాలేమి కారణంగా వెనుకబడిన కులాలు. ఈ కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక హింసకు వీరి వెనుకబాటుతనం ఒక ముఖ్య కారణమని అంగీకరించడం అత్యవసరం.

ఈ ఏడాది ఆరంభంలో గుజరాత్‌లో 19 ఏళ్ల యువతిని నలుగురు పురుషులు అపహరించి సామూహిక అత్యాచారం చేసి, చెట్టుకు ఉరేసి హత్య చేశారు. ఆమె జననాంగాలు నలిగిపోయి, ఆమె పురీషనాళం దారుణంగా దెబ్బతిన్నట్టు శవపరీక్షలో తేలింది. కాని, ఆమె గురించి ఎవరూ మాట్లాడలేదు. ఎక్కడా నిరసనలు జరగలేదు. ఎందుకంటే ఆమె దళిత మహిళ. ఆ తరువాతి నెలలో, అదే వయస్సులో ఉన్న మరో మహిళపై అత్యాచారం జరిగింది. అత్యాచారం తరువాత ఆమె జననేంద్రియాలలో ఇనుపరాడ్ చొప్పించారు. ఆమె నాగ్‌పూర్‌లో కూలీగా పని చేసేది. దురదృష్టవశాత్తు సభ్యసమాజంలో ఆమె వేదనాభరిత సంఘటన కూడా చలనం కలిగించలేదు. ఒకటిన్నర దశాబ్దాలుగా మావోయిస్టు నేతృత్వంలో సంఘర్షణ జరుగుతున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2018లో 23 ఏళ్ల గిరిజన గర్భిణిపై భద్రతా దళాలు అత్యాచారం చేశాయని ఆరోపణ వచ్చింది. ఆ సంవత్సరం ఛత్తీస్‌గఢ్ పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ కంటే ఎక్కువ అత్యాచార రేటు నమోదు చేసింది. కానీ జాతీయ వార్తలలో ఎవరూ దీన్ని ప్రస్తావించలేదు.

నిర్భయ ఘటన తర్వాత ఇటీవల హైదరాబాద్‌లో 27 ఏళ్ల వెటర్నరీ డాక్టరు (‘దిశ’)పై జరిగిన సామూహిక అత్యాచారం, దహనం సంఘటనకు మళ్ళీ ఆ స్థాయిలో స్పందన వచ్చింది. ఈ రెండు ఘటనల మధ్య కాలంలోనూ దేశంలో ఎన్నో ఘోరమైన అత్యాచార సంఘటనలు జరిగాయి. కానీ వాటి పట్ల ప్రజల నుంచి పెద్దగా స్పందన లేదు. దిశ ఘటన తర్వాత వెల్లువెత్తిన నిరసనలు ఎన్‍కౌంటర్ వరకు కొనసాగాయి. ఈ దుర్ఘటనల పట్ల మీడియాలోనూ, ప్రజల్లోనూ కనిపించే స్పందనలో వివక్ష అనే పార్శ్వం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. నిర్భయ ఘటనైనా, దిశ ఘటనైనా నగర భారతంలో జరిగిన సంఘటనలు కాబట్టే మీడియా వాటికి ప్రాధాన్యం ఇచ్చింది. నాణేనికి మరో పార్శ్వంలా గ్రామీణ నేపథ్య ‘హత్యాచారాలకు’ ఎటువంటి ప్రాధాన్యమీయకుండా మీడియా వ్యవహరిస్తున్న తీరు భావ ప్రకటనలో ద్వంద్వప్రమాణాలకు ప్రతీకగా మారింది.

నిర్భయ ఘటన తరువాత చాలామంది స్త్రీవాదులు నిరసనలు వ్యక్తం చేశారు. దళిత స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల పట్ల వారెందుకు స్పందించడం లేదు? ఎందుకంటే, వాస్తవానికి ప్రధాన స్రవంతి స్త్రీవాదులు కూడా ఏదో ఒకవిధంగా కులవాదులేనన్నది నివురుగప్పిన నిజం. ‘మీరు భారతదేశంలో ఒక మహిళై ఉండి, అందులో పేద, దళిత మహిళ అయితే – అంతకన్నా ఘోరమైన స్థానం మరొకటి లేదు’ అన్న ఆలిండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియం ధవాలే వ్యాఖ్యలు ఒక భయంకర పరిస్థితికి అద్దం పడుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా ప్రతిరోజూ నలుగురుకి పైగా దళిత మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. సివిల్ సొసైటీ గ్రూప్ నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్‌రైట్స్ ప్రకారం 23 శాతం మంది దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు, వారిలో చాలామంది అనేకమార్లు అత్యాచారానికి గురయ్యారు. 2018లో దేశవ్యాప్తంగా నమోదైన 33,977 అత్యాచార కేసులలో, బాధితుల్లో 10 శాతం మంది దళిత లేదా గిరిజనులేనని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దళిత మహిళలపై అత్యాచారాల సంఖ్య ఇప్పుడు రోజుకు ఆరుకు పెరిగింది. ఇవి కేసులుగా నమోదైన అత్యాచారాలు మాత్రమే. గ్రామీణ ప్రాంతాల్లో అనేక సంఘటనలు కనీసం కేసు నమోదు దాకా కూడా రావు. ఎందుకంటే చాలా సందర్భాల్లో రేపిస్టులు ఆధిపత్య, ఉన్నత కులాలకు చెందినవారు. బాధితులు ఆర్థికంగా, సామాజికంగా బలహీనులు.

మహిళలు తమదైన ఎంపికను వ్యక్తం చేసినప్పుడు లేదా ఆర్థికంగా స్వతం త్రంగా ఉన్నప్పుడు పురుషులు దీనిని అంగీకరించలేరు. దళిత మహిళల విషయంలో, కుటుంబంలో చాలామంది తమ కుటుంబ పోషణకు ఇళ్ల నుంచి బయటకు రావాలి. సంపాదించడానికి అసాధారణమైన శ్రమతో కూడిన పనిలో నిమగ్నమవ్వాలి. ఉన్నత కుల మహిళల వలే సున్నితంగా కాకుండా వారి ఉద్యోగాలలో దూకుడుగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతుంది. స్వేచ్ఛాప్రవృత్తి, దూకుడు స్వభావం కొన్నిసార్లు వాళ్ళ పాలిట శాపమవుతుంది. సోని సోరి, భన్వారీదేవి కేసులు ఈ మనస్తత్వానికి ప్రామాణిక ఉదాహరణలు. మావోయిస్టులు, ఎస్సార్ గ్రూపుల మధ్య కొరియర్‍గా పనిచేస్తున్నారనే ఆరోపణలతో సోని సోరి అనే యువ గిరిజన ఉపాధ్యాయురాలిని అరెస్టు చేశారు. తనపై మోపిన ఆరోపణలను అంగీకరించడానికి ఆమె నిరాకరించడంతో ఉన్నత కుల పోలీసు అధికారులు దారుణంగా సామూహిక అత్యాచారానికి గురిచేశారు. ఒక స్త్రీ స్వతంత్ర స్వభావాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. బాల్య వివాహానికి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడినందుకు 1992లో భన్వారీదేవిపై అత్యాచారం జరిగింది. ఆమె రాష్ట్ర ప్రభుత్వ ‘మహిళా అభివృద్ధి ప్రాజెక్టు’ కోసం ‘సాథీ’గా పని చేసిన శ్రామిక మహిళ. ఆమె తెగింపును భరించలేని గ్రామంలోని ఉన్నత కుల పురుషులు ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. మహిళల్లో ధిక్కారస్వరాన్ని సాధారణంగా పురుషస్వామ్యం అంగీకరించదని, అందుకే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని తారా కౌషల్ తన ‘వై మెన్ రేప్’ పుస్తకంలో పేర్కొన్నారు. అసలు నిజమేంటంటే ఒక దళిత అమ్మాయి ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నించినా, తన మానాన తాను పనిచేసుకుంటూ సమాజాన్ని ధిక్కరించినా ఏ ఉన్నత కులస్థుడూ భరించలేడు. చాలా సందర్భాల్లో ఆ అమ్మాయి కనీసం గ్రామంలోని సదరు వ్యక్తుల ముఖం సైతం చూసి ఎరగదు. ఇక్కడ అణిగిమణిగి ఉండటానికి ఒప్పుకోని ఆమె అస్తిత్వమే వారికి కంటగింపు.

‘దళిత మహిళలకు గౌరవం, మర్యాదలు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరు’ అని న్యాయవాది సవిత ‘నేషనల్ క్యాంపెయిన్ ఆన్ దళిత్ హ్యూమన్ రైట్స్’ ప్రచురణలో పేర్కొన్నారు. ‘దళితేతర, దళిత మహిళలు ఒకటేనని నేను అంగీకరించను. ఇక్కడ కులం వారిని వేరుపరుస్తుంది’ అనే ఆమె మాటలు అక్షరసత్యం. న్యాయం పొందడంలో కూడా దళిత మహిళలు తీవ్ర వివక్షకు గురవుతున్నారు. జాతీయ శిక్షా రేటు 25 శాతంతో పోలిస్తే, దళిత మహిళలపై అత్యాచారాలకు విధించే శిక్షా రేటు 2 శాతం కంటే తక్కువగా ఉంది. 2018లో థామస్ రూటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వే ఎన్నో దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది. మహిళలకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా మనదేశం నిలవడం భయాన్ని కలిగించే అంశం. ఇందులో అత్యధికంగా లైంగిక హింసను ఎదుర్కొంటున్నది దళిత స్త్రీలే నన్నది సుస్పష్టం దేశంలో ఎక్కడ లైంగిక నేరం జరిగినా దానికి మద్యపానాన్ని, ఇంటర్నెట్‌ను నిందించేందుకు సిద్ధంగా ఉండే సమాజం దళిత మహిళలపై దాష్టీకాలను నిర్వచించడంలో మాత్రం విఫలమైంది. ఇటీవల మార్కండేయ కట్జూ వంటి బాధ్యతగల మాజీ న్యాయమూర్తి అత్యాచారాలకు నిరుద్యోగం కారణమని సెలవివ్వడం ఆ ఉన్మాదులకు ఊతమివ్వడం తప్ప మరొకటి కాదు. నిజానికి హాథ్రాస్‌ సంఘటనలోని నిందితులంతా ఆర్థికంగా బాగున్నవాళ్ళే. అందులో ఇద్దరికి వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ ఒరవడిలో పడిపోయిన జాతీయ, ప్రాంతీయ మీడియాను గ్రామీణస్థాయిలో జరిగే దారుణాలకు ప్రాధాన్యం కలిపించడంలో అంతులేని నిర్లక్షం ఆవహిస్తుంది. సమానత్వం, మార్పు కోసం ప్రయత్నించే బాధ్యత మనపై ఉంది. మరీ ముఖ్యంగా, శతాబ్దాలుగా మనల్ని పీడిస్తున్న సామాజిక రుగ్మతలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక సమగ్రతకు సమయం ఆసన్నమైంది.

అసిస్టెంట్ ప్రొఫెసర్, చరిత్ర శాఖ,
మహాత్మ గాంధి యూనివర్సిటి

Courtesy Andhrajyothi