•  అందుబాటులోకి ఆస్ట్రాజెనెకా-సీరం ఇన్‌స్టిట్యూట్‌ టీకా
  •  కేంద్రం నుంచి అనుమతి లభిస్తే ఆ వెంటనే పంపిణీ
  •  వెల్లడించిన సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో పూనావాలా

న్యూఢిల్లీ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకా.. దేశ ప్రజలకు అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. తమ సంస్థ భాగస్వ్యామంతో అభివృద్ధి చేసిన ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా టీకా ‘కొవిషీల్డ్‌’ను డిసెంబరులో వినియోగంలోకి తెస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదర్‌ పూనావాలా తెలిపారు. మొత్తం పది కోట్ల డోసులను అందుబాటులోకి తేనున్నట్లు ఆయన ప్రకటించారు. కేంద్రం నుంచి అత్యవసర అనుమతులు లభిస్తే అదే నెలలో పంపిణీ ప్రారంభిస్తామని వివరించారు. వచ్చే ఏడాది మొదట్లో పూర్తి స్థాయి అనుమతులు లభించవచ్చన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా, వంద కోట్ల (బిలియన్‌) డోసుల ఆస్ట్రాజెనెకా టీకా ఉత్పత్తిలో ఆక్స్‌ఫర్డ్‌తో సీరం ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామి. ఇందులో భాగంగా తొలి దశలో ఉత్పత్తయిన టీకా డోసులు సగం ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుబంధ కార్యక్రమం కొవాక్స్‌ ద్వారా పేద దేశాలకు వెళ్లనున్నాయి. కాగా, ఇప్పటికే కొవిషీల్డ్‌ తుది దశ ట్రయల్స్‌ పూర్తయి, పూర్తి సురక్షితమని తేలింది. కరోనా టీకా ఉత్పత్తికి సీరం.. మొత్తం ఐదు సంస్థలతో ఒప్పందం చేసుకుంది.

ఆస్ట్రాజెనెకా గత రెండు నెలల్లో 4 కోట్ల డోసులను ఉత్పత్తి చేసింది. దీంతోపాటు సీరం ఒప్పందం చేసుకున్న మరో సంస్థ నొవావాక్స్‌ టీకా త్వరలో ఉత్పత్తి కానుంది. ఈ రెండింటి పనితీరుపై పూనావాలా సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్కల్‌ సొరియట్‌.. డిసెంబరులో పెద్దఎత్తున టీకా పంపిణీకి సిద్ధమవుతున్నట్లు ఇప్పటికే ప్రకటిచారు. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ప్రభుత్వం నుంచి అత్యవసర అనుమతి వస్తే.. అదే వివరాలను భారత ప్రభుత్వానికి సీరం ఇన్‌స్టిట్యూట్‌ సమర్పించనుంది.

Courtesy Andhrajyothi