ప్రపంచబ్యాంకు అంచనా

న్యూఢిల్లీ : ఓ పక్క ఉద్యోగాలు ఊడుతున్నాయి.. చేతిలో చిల్లి గవ్వలేక కుటుంబాలకు కుటుంబాలూ… వీధుల పాలవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కరీం ఢిల్లీలో పనిచేసేవాడు. నెలంతా కష్టపడితే రూ.9 వేలు వచ్చేది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇద్దరు బిడ్డలతో కలిసి సొంతూరికి చేరుకున్నాడు. రెండు నెలలుగా ఒక్క పైసా సంపాదనలేదు. పిల్లల పుస్తకాలు, యూపిఫాం కోసం దాచిపెట్టిన మొత్తం గత రెండు నెలలుగా ఇంటి పోషణకు ఖర్చు చేశాడు. ‘తిరిగి ఢిల్లీ వెళితే.. ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు.. ఇక్కడా చేసేందుకు పని దొరకటంలేదు… ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాం..’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు కరీం. ‘ఇక్కడ కర్మాగారాలు లేదా పరిశ్రమలు లేవు, కొండలు మాత్రమే ఉన్నాయి..’ అని గుజరాత్‌ లోని అహ్మదాబాద్‌ నుంచి రాజస్థాన్‌లోని సొంత ఊరుకు కాలిబాటన వెళ్ళిన సురేంద్ర హడియా డామర్‌ వాపోయారు. పొదుపుచేసుకున్న కొద్ది మొత్తం ఖర్చయిపోతున్నది. ఇక రాబోయే కాలం.. మా పరిస్థితి ఏమిటో అర్థంకావటంలేదని ఆయన అన్నారు.

నేడు దేశవ్యాప్తంగా నెలకొన్న దయనీయ పరిస్థితి ఇదే. కరోనా మహమ్మారి.. ఆ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ దేశంలో దాదాపు 1.2 కోట్ల మందిని తీవ్ర పేదరికంలోకి నెట్టేసినట్టు ప్రపంచబ్యాంకు అంచనా. మహమ్మారి యొక్క ఆర్ధిక విధ్వంసం ఫలితంగా.. ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికిపైనే ప్రజలు ‘తీవ్ర పేదరికం’లో కూరుకుపోయారని అంచనావేసింది. 12.2 కోట్ల మంది భారతీయులు గత నెలలో ఉద్యోగాలు కల్పోయినట్టు సీఎంఐఈ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే.

మోడీ ఏం చేశారు?
అత్యంత క్లిష్ట సమయంలో.. ఆకలిచావులకు సైతం గురవుతున్న వలసకార్మికులను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌తో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ట్రాక్‌ ట్రాక్‌ మీదికి తెచ్చేందుకు, ఉద్యోగాల కల్పనకు తీసుకునే చర్యలపైనా ఆయన నోరు విప్పటంలేదు. కార్పొరేట్లకు దోచిపెడుతున్న మోడీ.. పేదలను మాత్రం గాలికొదిలేశారన్న వాదనా వినిపిస్తున్నది. ఈ ఏడాది ఉద్యోగ రేటు మెరుగుపడుతుందని తాను ఊహించటంలేదని ఐపీఈ గ్లోబల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశ్వజిత్‌ సింగ్‌ అన్నారు. ‘వైరస్‌ కంటే ఎక్కువ మంది ఆకలితో చనిపోవచ్చు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.

Courtesy Nava Telangana