– భారీగా కుంగిన కోర్‌ సెక్టార్స్‌ గ్రోత్‌
– ఆగస్టు మాసంలో 0.5%గా నమోదు
– ప్రతికూలతలో 5 కీలక రంగాల వృద్ధి
– ఫలితం కనిపించని సర్కారు చర్యలు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా పలు చర్యలు తీసుకుంటున్నట్టుగా కేంద్రంలోని మోడీ సర్కారు ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ.. పరిస్థితిలో మాత్రం మార్పు కనిపించడంలేదు. తాజాగా కేంద్రం ప్రకటించిన ఎనిమిది కీలక రంగాల పరిశ్రమల ప్రగతియే ఇందుకు ప్రత్యక్ష తార్కాణం. గత ఆగస్టు మాసంలో ఎనిమిది కీలక రంగాల పరిశ్రమల వృద్ధి మూడున్నరేండ్ల కనిష్టానికి కుంగి 0.5 శాతంగా నమోదు అయినట్టుగా స్వయానా సర్కారే సోమవారం ప్రకటించింది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, విద్యుత్తు రంగ పరిశమ్రల ఉత్పత్తి గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో కోర్‌ సెక్టర్‌ ఇండిస్టీస్‌ గ్రోత్‌ కుంగినట్టుగా సర్కారు వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఏడాది ఆగస్టు మాసంలో కీలక రంగాలుగా పరిగణించే బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, చమురు శుద్ది, ఎరువులు, ఉక్కు, సిమెంట్‌, విద్యుత్తు రంగ పరిశ్రమల ఉత్పత్తి 4.7 శాతంగా నమోదు అయింది. వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించిన సమాచారం మేరకు గత ఆగస్టు మాసంలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, సిమెంట్‌, విద్యుత్తు రంగ పరిశ్రమల ఉత్పత్తిలో వరుసగా 8.6%, 5.4%, 3.9%, 4.9%, 2.9% ప్రతికూల వృద్ధి నమోదైంది. మరోవైపు ఆగస్టు మాసంలో ఎరువులు, ఉక్కు, రం గ పరిశ్రమల ఉత్పత్తిలో 2.9%, 5.0% వృద్ధి నమోదైనట్టుగ సర్కారు తెలిపింది. ముడి చమురు రంగ పరిశ్రమల ఉత్పత్తి ఆగస్టు మాసంలో 5.1 శాతం నుంచి 2.6 శాతానికి పడిపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అయిదు నెలల కాలంలో కీలక రంగాలకు చెందిన పరిశ్రమల వృద్ధి కేవలం 2.4 శాతంగానే నమోదు అయింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి 5.7 శాతంగా ఉంది.

చాలా నిరుత్సాహకరం: ఇక్రా
ప్రభుత్వం సోమవారం ప్రకటించిన కీలక రంగాల వృద్ధి సమాచారం చాలా నిరుత్సాహకంగాను, బలహీనంగాను ఉందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఇక్రా పెదవి విరిచింది. ఎనిమిది కీలక రంగాలలో ఆరు రంగాల వృద్ధిలో విస్తృత ఆధారిత క్షీణత నమోదు అయినట్టుగా సంస్థ విశ్లేషించింది. ఆగస్టు మాసంలో మొత్తం ఎనిమిది రంగాలకు గాను అయిదు రంగాల పనితీరును ఏడాది ప్రాతిపదికన విశ్లేషిస్తే కుంగుదలే కనిపిస్తోందని.. ఇది చాలా నిరుత్సాహకర పరిణామమని ఇక్రా వివరించింది.

Courtesy Navatelangana…