————చల్లపల్లి స్వరూపరాణి

అంబేద్కర్ బౌద్ధంలోకి మతం మారినందుకు కాదు. ఆయన మతం మారుతూ తన అనుయాయులతో చేయించిన ప్రమాణాలను చూసి బ్రాహ్మణవాదులకు బాగా అసహనం వచ్చింది. ఈ ప్రమాణాలన్నీ బ్రాహ్మణీయ హిందూమతం లోని లొసుగులను ఎత్తి చూపడమేకాక అప్పటికి బౌద్ధాన్ని హిందూమతంలో భాగమని ప్రచారం చేసే కుట్రని భగ్నం చేసేవిధంగా ఉండడం వారికి బొత్తిగా నచ్చలేదు. పైగా ఆయన బౌద్ధాన్ని తన వ్యక్తిగత విముక్తి కోసంగాక సామాజికంగా కులం నుంచి, మతం తాలూకు మూఢత్వం నుంచి తన ప్రజల విముక్తి మార్గంగా చెప్పడం వారికి అహం దెబ్బతినింది. ఆయనతో పాటు లక్షలాది మంది నాగపూర్ లో బౌద్ధ ధమ్మ దీక్ష తీసుకోవడం అంబేద్కర్ సూచించిన సామాజిక విప్లవ సిద్ధాంతాన్ని ఆచరించడంగా అర్ధం చేసుకోవాలి. అంబేద్కర్ బౌద్ధ ధమ్మ దీక్ష ప్రభావం చదువుకున్న దళితులలో కొంతమేరకు ప్రభావం చూపిందనవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి జె. ఈశ్వరీబాయి, ప్రొఫెసర్ పావన మూర్తి, ఎం. ఎన్. భూషి వంటివారు ఆయనతో పాటు 1956 నాగాపూర్ బౌద్ధ దీక్షలో భాగమయ్యారు. ఆ తర్వాత భాగ్యరెడ్డి వర్మ, ఆయన ఉద్యమ సహచరులైన అరిగే రామస్వామి, బి. ఎస్. వెంకట్రావు, బత్తుల శ్యాం సుందర్ వంటివారితో పాటు తర్వాతి తరంలో ఎండ్లూరి చిన్నయ్య, వామనదాసు, దేవరపల్లి శ్రీరాములు(శాంతిదేవ్)మొదలైన అనేకమంది బౌద్ధంలోకి మారి అంబేద్కర్ సూచించిన ప్రత్యామ్నాయ సంస్కృతిని వారు పట్టుదలగా ముందుకు తీసుకెళ్ళారు. ఒక పక్క క్రైస్తవం దళితులను పెద్దయెత్తున ఆకర్షిస్తూ మరోవైపు హైందవ మత పెద్దలు బౌద్ధాన్ని హిందూమతంలో భాగమని ప్రచారం చేస్తున్న రోజుల్లో కొంత తక్కువ సంఖ్యలో అయినా అంబేద్కర్ ఇచ్చిన పిలుపును అందుకుని బౌద్ధాన్ని స్వీకరించి తమదైన పద్ధతిలో ఆచరిస్తూ ప్రచారం చేశారు. ఇప్పుడు అంబేద్కర్ బౌద్ధధమ్మ పరంగా చేసిన విస్తృతమైన కృషి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా మేధావులు, ఆలోచనాపరులు బౌద్ధం వైపు చూస్తున్నారు. ఆయన బౌద్ధాన్ని కేవలం ఒక మత సిద్ధాంతంగా కాక సమతకు, కరుణకు, ప్రజ్ఞకు పెద్ద పీట వేసే తత్వంగా విశ్లేషించడమే అందుకు కారణం. మహారాష్ట్ర లో అంబేద్కర్ దీక్షా ప్రభావం ఆయన అనంతర కాలంలో దళిత సమాజంలో ఎక్కువగానే ఉంది. ఆయనతో పాటు దీక్ష తీసుకున్న దళితులు మూఢనమ్మకాలను, వెనుకబాటుతనాన్ని వొదిలి తమ సంతానం విద్యాభివృద్ధికి కృషి చేసి ఇంకా హిందువులుగా ఉన్న దళితుల కంటే, క్రైస్తవంలోకి మారిన దళితులకంటే అభ్యుదయకరంగా ఎదిగారు. అంతేకాదు కులపరంగా తమ పాత గుర్తింపు అయిన ‘మహర్’ అనేదాన్ని త్యజించి ‘నియో బుద్ధిష్ట్’ అనే సామాజిక గుర్తింపును పొందారు. జనాభా లెక్కలలో కూడా అరవైవ దశకం నుంచి షెడ్యూలు కులాల జాబితాలో ‘నియో బుద్ధిస్ట్’ అనే సామాజిక వర్గం పేరు చేరడం విశేషం.

బొంబాయిలో అంబేద్కర్ అంత్యక్రియలు జరిగిన ‘చైత్య భూమి’తోపాటు ధర్మ దీక్ష తీసుకున్న నాగపూర్ ‘దీక్షా భూమి’ దానికి అనుసంధానంగా నిర్మించిన ‘నాగలోక్’ ఇప్పుడు అంబేద్కర్ అనుచరులకు ఒక ముఖ్య కేంద్రాలుగా మారాయి. అక్కడికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 14 న పెద్దఎత్తున అంబేద్కర్ వాదులు వచ్చి ‘దీక్షాభూమి’ ని దర్శిస్తారు. ‘నాగలోక్’ లో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు. నాగపూర్ ఆరోజు నీలం రంగు జెండాల వూరేగింపులతో, డప్పుల చప్పుడుతో, ‘జై భీమ్’ నినాదాలతో హోరెత్తుతుంది. ఆరోజు అనేకమంది కొత్తగా బౌద్ధ దీక్ష తీసుకోవడం సంవత్సరాల నుంచీ జరుగుతూనేవుంది. అయినా రోజూ తిరుమల తిరుపతిలో రోజువారీ పూజా కార్యక్రమాలు, భక్తుల రద్దీ గురించి క్రమం తప్పకుండా కవర్ చేసే మనువాద మీడియా ‘దీక్షాభూమి’ కార్యక్రమాలను కనీసం ప్రస్తావించదు.

డాక్టర్ అంబేడ్కర్ అక్టోబర్ 13, 1935 న యోలా మహా సభలో తాను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మరణించబోనని ప్రకటించాడు. 1956, అక్టోబర్ 14 న నాగపూర్ లో బౌద్ధ ధర్మ దీక్ష సందర్భంగా 22 ప్రమాణాలను రూపొందించి తనతో పాటు బౌద్ధ ధర్మ దీక్ష తీసుకున్న తన అనుయాయులతో యీ ప్రమాణాలను చేయించాడు.

1. నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను దేవుళ్ళుగా విశ్వసించను, పూజించను
2. రాముడిని, కృష్ణుడిని దేవుని అవతారాలుగా విశ్వసించను, పూజించను
3. గౌరి, గణపతి వంటివారిని నా దేవీ, దేవతలుగా విశ్వసించను, పూజించను
4. దేవుడి అవతారాలు అనే భావనను నేను నమ్మను
5. బుద్ధుడిని విష్ణుమూర్తి అవతారంగా నేను నమ్మను, అటువంటిది ఒక విధమైన అసత్య ప్రచారంగానూ, పిచ్చి గానూ భావిస్తాను
6. నేను శ్రాద్ధ కర్మలను పాటించను, పిండ ప్రదానం చెయ్యను
7.నేను బుద్ధుడి బోధనలకు, నియమాలకు వ్యతిరేకముగా ప్రవర్తించను
8. నేను బ్రాహ్మణుల చేత యెటువంటి కర్మ కాండలు జరిపించను
9.నేను మానవుల మధ్య సమత వుండాలని నమ్ముతాను
10. నేను మనుషుల మధ్య సమత అనేది పెంపొందటానికి కృషి చేస్తాను
11. నేను బుద్ధుడు బోధించిన అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తాను
12. నేను బుద్ధుడు బోధించిన పది పారమితల్ని పాటిస్తాను
13. నేను సమస్త జీవుల పట్ల ప్రేమను, దయను కలిగి వుంటాను
14. నేను దొంగతనం చెయ్యను
15.నేను అబద్ధం ఆడను
16. నేను వ్యభిచరించను
17. నేను మధ్యపానం చెయ్యను
18. నేను అనుదినం అష్టాంగ మార్గాన్ని పాటిస్తూ అందరి పట్ల ప్రేమతో, దయతో మసలుకుంటాను
19. నేను అసమానత్వానికి ప్రాతిపదికగా, మనుషుల అభివృద్ధికి నిరోదకంగా వుండే హిందూ మతాన్ని త్యజించి, బౌద్ధాన్ని నా స్వంత మతంగా స్వీకరిస్తాను
20. బుద్ధుని ధర్మమే అసలైన మతమని దృఢంగా విశ్వసిస్తాను
21. నేను బుద్ధుని ధర్మంలోకి రావడాన్ని కొత్త గా జన్మించినట్టు భావిస్తాను
22. నేను యిప్పటినుంచి నా జీవితాన్ని బుద్ధుని బోధనలకు అనుగుణముగా జీవిస్తానని గంభీరంగా ప్రకటిస్తున్నాను.