• యాదాద్రి రాతి స్తంభాలపై కేసీఆర్‌ చిత్రం
  • టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు కూడా
  • తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం,
  • కేసీఆర్‌ కిట్‌, హరితహారం, రాష్ట్ర పక్షి,
  • రాష్ట్ర జంతువు తదితరాలకూ స్థానం
  • అష్టభుజి ప్రాకార మండపంలో నిక్షిప్తం
  • వైభవంగా శ్రీ తిరుకవాట గ్రామ మహోత్సవం
  • యాదాద్రి చేరిన ఆలయ ద్వార కవాటాలు
మీరు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్లారనుకోండి! అక్కడ ఆలయ అష్టభుజి ప్రాకార మండపంలోని రాతి స్తంభంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం కనిపిస్తుంది! ఇంకొంచెం ముందుకు వెళితే.. టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు ‘కారు’ చెక్కి ఉంటుంది! మరికాస్త ముందుకు వెళితే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన కేసీఆర్‌ కిట్‌, తెలంగాణకు హరితహారం తదితరాలూ రాతి స్తంభాలపై కనిపించనున్నాయి. ఈ మేరకు రాబోయే వెయ్యేళ్లపాటు
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ‘సారు.. కారు.. సర్కారు పథకాల’ను రాతి స్తంభాలపై చెక్కుతున్నారు. పురాతన ఆలయాలపై అలనాటి చరిత్ర, సంస్కృతి, జీవన విధానాలను చెక్కిన విషయం తెలిసిందే. పురాతన కాలపు నిర్మాణ రీతులు.. అప్పట్లో వినియోగించిన నాణేలు, వ్యవసాయ పద్ధతులు.. ఆచరించిన ధర్మాలను రాతి స్తంభాలపై చెక్కారు. శతాబ్దాల కాలం నాటి రాతి స్తంభాలపై చిహ్నాలు, బొమ్మలు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలోనూ ఇదే పద్ధతిని అవలంబిస్తున్నారు. రాజుల కాలంనాటి నిర్మాణ రీతులను పుణికి పుచ్చుకుని ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఆలయంలోని కృష్ణ శిలలపై నేటి సంస్కృతి, సంప్రదాయాలతోపాటు రాజకీయ అంశాలను కూడా పొందుపరుస్తున్నారు. ఆధ్యాత్మిక, పురాణ, ఇతిహాసాలు, సంస్కృతి, సంప్రదాయాలతోపాటు ప్రజల జీవన విధానం, ఆధునిక తెలంగాణ చరిత్రను రాతి స్తంభాలపై శాశ్వతపరుస్తున్నారు. అష్టభుజి ప్రాకార మండప రాతిస్తంభాలపై ప్రస్తుతం చలామణీలో లేని పైసా, రెండు, మూడు, ఐదు, ఇరవై పైసల నాణేలు పొందుపరిచారు. అలాగే, బతుకమ్మ వంటి పండుగలు, నాగలి దున్నే రైతు వంటి బొమ్మలతో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను నిక్షిప్తం చేశారు. తాజాగా ప్రాకార మండపానికి దక్షిణం వైపుగల రాతి స్తంభాలపై తెలంగాణ ఆధునిక చరిత్ర, ప్రభుత్వ పథకాలతోపాటు రాజకీయ అంశాలను చెక్కుతున్నారు.
అష్టభుజి ప్రాకార మండపాల బాలపాద పిల్లర్లపై ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు, ప్రభుత్వ పథకాలైన తెలంగాణకు హరితహారం, కేసీఆర్‌ కిట్‌, తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నం, తెలంగాణ చిత్రపటంలో చార్మినార్‌, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర జంతువు కృష్ణ జింక, జాతీయ పక్షి నెమలి వంటి చిహ్నాలను చెక్కుతున్నారు. అయితే, ప్రధాన స్తపతి ఆనందసాయి నేతృత్వంలో యాదాద్రి పునర్నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని రాతి స్తంభాలపై నిక్షిప్తం చేయాలని, భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్దేశించారని ఆలయ శిల్పులు చెబుతున్నారు. కానీ, రాతి స్తంభాలపై కేసీఆర్‌ చిత్రం, టీఆర్‌ఎస్‌ ఎన్నికల గుర్తు కారు తదితరాలను చెక్కాలని ముఖ్యమంత్రి సూచించారా? లేక ఆలయ శిల్పులు అత్యుత్సాహంతో వాటిని చెక్కుతున్నారా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

(COURTECY ANDHRA JYOTHI)