• మబ్బుల నుంచే మీ సేవ సెంటర్ల దగ్గర వేలాది మంది క్యూ
  • గంటల తరబడి తిండీతిప్పలు లేక ఎదురుచూపులు
  • క్యూ లైన్​లోనే ప్రాణాలొదిలిన మహిళ.. సొమ్మసిల్లిన వృద్ధులు
  • మధ్యాహ్నం ఈసీ ఆదేశంతో సెంటర్లు క్లోజ్‌.. రోడ్డెక్కిన బాధితులు
  • ఇప్పటికే 4.75 లక్షల మందికి సాయం చేశామంటున్న సర్కార్​
  • మరి మీసేవ సెంటర్ల ముందు లక్షల మంది క్యూలేంది?
  • సాయం పంపిణీ తీరుపై బాధితుల్లో అనుమానాలు

హైదరాబాద్‌ :హైదరాబాద్​లో వరద సాయం పంపిణీ ఆగిపోయింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్​ ఆదేశాలతో బుధవారం మధ్యాహ్నం మూడుగంటల నుంచి బాధితుల వివరాల నమోదు నిలిపివేశారు. దీంతో అప్పటికే మీసేవ సెంటర్ల వద్ద పేర్ల ఎంట్రీ కోసం తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడ్డ వరద బాధితులు.. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. వరదలు వచ్చి నెలరోజులవుతున్నా ఇంతవరకు తమకు సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో లీడర్లే డబ్బులు పంచుకొని తిన్నారని, ఇప్పుడు మీసేవ సెంటర్లలో అప్లయ్​ చేసుకోవాలని చెప్పి గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టారని, తీరా మధ్యాహ్నం ఆపేస్తున్నట్లు ప్రకటించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా మందికి వరద సాయం చేశామని, ఇంకా ఎవరైనా మిగిలితే మీసేవ సెంటర్లలో పేర్లు నమోదు చేసుకోవాలని ఐదురోజుల కింద ప్రభుత్వం చెప్పడంతో సోమవారం నుంచి మీసేవ సెంటర్లకు బాధితులు పోటెత్తారు. బుధవారం మబ్బుల మూడు నాలుగు గంటల నుంచే చాలా సెంటర్ల ముందు  క్యూ కట్టారు.కొందరైతే అర్ధరాత్రి నుంచే అక్కడ వెయిట్​ చేశారు. తిండీ తిప్పలు మరిచి సాయం కోసం ఎదురుచూశారు. చంటి పిల్లలతో వచ్చి పడిగాపులు కాశారు.

క్యూలైన్​లోనే కుప్పకూలిన మహిళ
గంటల తరబడి మీ సేవ సెంటర్​ వద్ద క్యూలో నిలబడ్డ 55 ఏండ్ల ఓ మహిళ అక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచింది. హకీంపేట కుంటకు చెందిన మునావర్​ ఉన్నీసా (55) తెల్లవారు జామునే టోలిచౌకిలోని గెలాక్సీ థియేటర్​ పక్కనే ఉన్న మీసేవ సెంటర్​కు చేరుకొని లైన్​లో నిలబడింది. ఉదయం 11 గంటలకు సెంటర్‌‌ను ఓపెన్‌‌ చేశారు. అందరూ లోపలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా మునావర్‌‌ ఉన్నీసా కుప్పకూలి పడిపోయింది. ఆమెను హాస్పిటల్‌‌కు  తరలించగా.. అప్పటికే చనిపోయింది. బాలాజీనగర్​, అడిక్​మెట్​ వంటి పలు చోట్ల క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. వనస్థలిపురంలో తోపులాట జరిగింది. దీంతో పలువురు మహిళలకు గాయాలయ్యాయి.

కిలో మీటర్ల మేర క్యూలు
బుధవారం తెల్లవారుజాము నుంచే చాలా మీసేవ సెంటర్ల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపించాయి. చిక్కడపల్లి, రాంనగర్​, కూకట్​పల్లి, అంబర్​పేట, టోలీచౌకి, మెహదీపట్నం, రాజేంద్రనగర్‌‌, అత్తాపూర్‌‌, హైదర్‌‌గూడ, బంజారాహిల్స్,  కుత్బుల్లాపూర్‌‌, షాపూర్‌‌నగర్‌‌, గాజులరామారం .. ఇట్ల ఏ మీసేవ సెంటర్​ వద్ద చూసినా భారీ క్యూలైన్లే కనిపించాయి.

రేషన్‌‌ కార్డు లింకుతో కొత్త చిక్కులు
వరద సహాయం కోసం మొదటి రెండు రోజులు ఆధార్‌‌ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్‌‌ మాత్రమే అడిగిన మీ సేవా సెంటర్‌‌ సిబ్బంది బుధవారం నుంచి రేషన్‌‌ కార్డు కంపల్సరీ అనే నిబంధన పెట్టారు. దాంతో చాలా మందికి ఆ విషయం తెలియక ఇబ్బంది పడ్డారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తమకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదని వాదించారు. అయినా నాలుగేండ్లుగా రేషన్‌‌ కార్డులే ఇవ్వడం లేదని నిలదీశారు. ఒక దశలో పోలీసులు మైకుల్లో రేషన్‌‌ కార్డులు ఉన్నవారే క్యూలో నిలబడాలని అనౌన్స్‌‌మెంట్‌‌ చేశారు. క్యూల్లో ఉన్న చాలా మంది మూడు రోజులుగా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారే కనిపించారు. రెండు రోజులుగా వచ్చి తిరిగి పోతున్నామని, చాన్స్‌‌ రాకపోవడంతో మళ్లీ వచ్చామని అన్నారు. రెండు రోజులుగా ఆధార్‌‌, బ్యాంక్‌‌ ఖాతా నెంబర్‌‌ మాత్రమే అడిగారనీ, ఈ రోజు కొత్త రూల్‌‌ పెట్టారని వాపోయారు.

4.75 లక్షల మందికి సాయం చేస్తే.. మరి ఈ క్యూలేంది?
ప్రభుత్వం ఇప్పటికే నాలుగు లక్షల 75వేల మంది  మంది వరద బాధితులకు రూ. పదివేల చొప్పున సాయం అందజేశామని చెప్తున్నది. ఇందుకోసం రూ. 475 కోట్లు ఖర్చు చేశామని అంటున్నది. అయితే.. సోమవారం నుంచి బుధవారం వరకు మీసేవ సెంటర్ల వద్ద లక్షలాది మంది బాధితులు సాయం కోసం క్యూలు కట్టారు. వరద బాధితులు ఐదు లక్షల మందే ఉన్నారని జీహెచ్‌‌ఎంసీ చెప్పింది. మంత్రి కేటీఆర్‌‌ కూడా అదే మాటన్నారు. ప్రభుత్వం నిజంగానే 4.75 లక్షల మందికి సాయం అందజేస్తే తామంతా ఎందుకు ఇలా క్యూ కట్టాల్సి వచ్చిందని బాధితులు ప్రశిస్తున్నారు. ‘‘మా ఇండ్లు మునిగిపోయిన విషయం వాస్తవం కాదా? ఆధారాలు చూపించాలా?’’ అని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.  ఇంతకీ ప్రభుత్వం ఇచ్చిన రూ. 475 కోట్లు ఎటు పోయాయని అనుమానం వ్యక్తం చేశారు. బాధితులకు కాకుండా టీఆర్‌‌ఎస్‌‌  లీడర్లు, కార్యకర్తలు పంచుకొని తిన్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్నటివరకు ఇంటికే వచ్చి సాయం చేస్తామని చెప్పినవాళ్లు, మూడురోజులుగా మీసేవ సెంటర్ల వద్ద క్యూలో నిలబెట్టారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు. నిలువ నీడ లేకుండా అన్నీ కోల్పోయి కట్టుబట్టలతో ఉన్న తమకు తిండీతిప్పలు లేకుండా చేశారని గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘బిచ్చగాళ్లను చేసిన్రు. ఇస్తే ఇయ్యాలా లేకుంటే లేదు. ఇంత అవస్థలు పెడ్తరా? ఓట్ల కోసం వస్తరు కదా.. మీ సంగతి చెప్తం’’ అంటూ చాలా చోట్ల బాధితులు హెచ్చరించారు.

మహిళలువృద్ధులపై లాఠీచార్జ్
అంబర్​పేట్, రామంతాపూర్​ మీసేవ సెంటర్ల​ వద్ద మహిళలు, వృద్ధులపై మఫ్టీ పోలీసులు లాఠీచార్జ్​ చేశారు. ఇష్టమున్నట్లు కొట్టారు. పోలీసుల తీరుపై బాధితులు మండిపడ్డారు. లాఠీచార్జ్​ వీడియోలు సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌  అయ్యాయి. రాంనగర్‌‌‌‌, అంబర్‌‌‌‌పేట్‌‌, రామంతాపూర్‌‌‌‌తో పాటు పలు మీసేవ సెంటర్ల వద్ద వరద బాధితులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రాజేంద్రనగర్‌‌, అత్తాపూర్‌‌, హైదర్‌‌గూడ ప్రాంతాల్లోని మీ సేవ సెంటర్లలో నిర్వాహకులు జనం నుంచి అప్లికేషన్​ ఫీజు పేరిట రూ. 400 దాకా వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెంటర్‌‌ లోపలికి వెళ్లే ముందు రెండు వందలు, రిజిస్ట్రేషన్‌‌ పూర్తి చేసుకొని బయటకు వెళ్లే ముందు మరో రెండు వందలు వసూలు చేశారని బాధితులు తెలిపారు. కుషాయిగూడ, ఏఎస్‌‌రావు నగర్‌‌, కమలానగర్‌‌, కాప్రాలో ఉదయం నాలుగు గంటల నుంచే క్యూల్లో నిలబడ్డా పదకొండు గంటల వరకు సెంటర్లు తెరవలేదు.

ఆగం చేసిన్రు
మూడు రోజుల నుంచి మీసేవ సెంటర్​కు పోతున్నా.. అప్లికేషన్​ పూర్తికాలేదు. ఇప్పుడేమో ప్రభుత్వం బంద్ చేసింది. ఇట్ల చేస్తే ఎట్ల? సాయం చేస్తమని చెప్పి ఆగం చేసిన్రు. ఓట్లు అడిగేందుకు మా ఇండ్లకు రావడానికి లీడర్లకు సిగ్గుండాలి.
– అలీమా బేగం, రిశాల గడ్డ, 

ముషీరాబాద్ మహిళలను రోడ్కెక్కించిన్రు
వరద సాయం ఇస్తామని చెప్పి మహిళలను రోడ్డెక్కించిన్రు. ఉన్నోళ్లకు ఇంటి దగ్గరికే వచ్చి సాయం అందించి, గరీబోళ్లను ఇట్ల తిప్పుతున్నరు. మూడ్రోజుల నుంచి మీసేవ చుట్టూ తిరిగినా మా పేరు రాసుకోలేదు. ఇప్పుడు సాయం బందైందంటున్నరు.
– ఎస్. లక్ష్మి ,  అజార్ గల్లి నివాసి, రాంనగర్

రేషన్​ కార్డు లేదని తీసుకోలే…
నేను నానల్​నగర్​ లో కూలీ పనిచేస్త. వరదసాయం ఇస్తున్నారని అప్లయ్​ చేసుకోడానికి మీసేవ  సెంటర్​కు  వస్తే రేషన్ కార్డులేదని వెనక్కి పంపిన్రు.  సాయం అందిస్తే అందరికి అందించాలి. కానీ కొందరికి ఇచ్చి.. మరికొందరికి ఇవ్వకపోతే ఎట్ల?
– చెన్నమ్మ,నానల్​ నగర్​

Courtesy V6 Velugu