గోదావరి –
        మద్దూరి నగేష్ బాబు
నిన్ను చూస్తంటే
నా నెత్తురు ఉరకలెయ్యటం లేదు
నిన్ను ముట్టుకుంటే
నాలో పడవ పాటలు పలకటం లేదు
నీలో మునిగితే
నా ఉప్పుచారలైనా పోవటం లేదు
గోదావరీ!
నువ్వెన్నడూ పల్లెకార్ల దానివి కాదు
నీ ఇసక గుండెలసంగతి
నేలనే కాదు-
మనుషుల్నీ పాయలు పాయలు గా చీల్చే నీ కుట్ర
నాకు తెలిసి పోయింది
నా రెక్క్ల కష్టాల ఇసక గూళ్లని తొక్కేసిన తప్పుడు దానా !
నిన్ను తలుచుకుంటే
నాకో చెరువు గుర్తొస్తంది
ఆ చెరువొడ్డున తెగిపడ్డ కారం చేడు
మాంసపు ముద్దలు గుర్తొస్తున్నాయి
గోదావరీ నిన్ను చూస్తే
నాకు వరద గుర్తుకొస్తంది
వరద రోజుల పస్తులు గుర్తుకొస్తన్నాయి
కుతికెలదాకా మునిగిన గుడిశెలు,
మునుగీత వేస్తున్న మా మల్లలూ మూకుళ్ళూ
నీ ఒళ్ళు బలుపుకి లాకుల్లో అడ్డంపడ్డ నా శవమూ
నా శవం మీది గద్దలూ డేగలూ గుర్త్తుకొస్తున్నాయి
గవర్నమెంటు పులిహోర పొట్లాల కోసం
విచ్చుకున్న తల్లుల ఆశల చూపులూ,
స్వచ్చంద సేవా సంస్థల గుడారాల దగ్గర
ఉమ్మిగుటకలు మింగుతున్న
నా తమ్ముళ్ళ రాతెండి కడుపుకోతలు గుర్తుకొస్తన్నయ్
గోదావరీ!
నీ ముందు నిలబడై
నేనెన్ని సార్లు గుండెలు బాదుకున్నానో
ఎన్ని సార్లు ఆకల్తో పొల్లిమార్లి ఏడ్చానో
కనీసం వినిపించుకున్నావంటే!
ఓపెన్ పాపాలు కడగడానికే పుట్టిన దానా
నీ అలల చప్పుడు వింటే నా చెవుల్లో శ్లోకాలు సలసలా జారుతుంటాయి
నీ మొఖం చూస్తే
నడివీధిలో నాని పోయిన
నా టంగుటూరి చెల్లెమ్మ శవం
నన్నో ప్రశ్నగా తిరగరాస్తూనే ఉంటుంది
గోదావరీ
కడుపునిండిన కవుల కవితా వస్తువా!
దరిద్రాన్నంతా ఇసకపిర్రలకింద కప్పెట్టి
పర్యాటక విటుల కోసం
కోనసీమ కొబ్బరాకుల పక్కలేసే డకాటీ దానా
నువ్వోచీకటి చరిత్రకి తొలి వాక్యానివి
ఙ్ఞానపీఠ అవార్డువీ
ఎంకివీ
ఊర్వశివీ
వరూధినివీ
అంతే తప్ప అలీసమ్మవి మత్రం కాదు
2
నది
చాలా విశాలంగా ఉంటుంద
పరమ గంభీరంగానూ ఉంటుంది
లోపల
లెక్కలేనన్ని చేతుల
తిమింగలాలుంటాయి
అంటుకుంటేనే షాక్ లు తగిలే షార్క్ లుంటాయి
నేలమట్టమైపోయిన సామ్రాజ్యాల వాసనలుంటాయి
అకాల మరణాల సమాదులుంటాయి
ప్రశాంతి నిలయాలూ
పచ్చి ఏమ్యుజ్ మెంట్ పార్కులూ
కోటమ్మ కంపెనీలూమ్ రుస్తుంఫ్రాంలూ ఉంటాయి !
మరి ముఖ్యంగా జైళ్ళుంటాయి
అడుగడుగునా మోహరించిన పారామిలిటరీ దళాలుంటాయి
అదీ ఇదేందీ! బతుకు తప్ప సమస్తమూ ఉంటుంది
నది తూర్పుకి తిరిగి నవ్వితే బంగాళాఖాతమయ్యింది
నది రైక మార్చుకోవటం మర్చిపోతే హిమవన్నగాలైనాయి
నది గొంతెత్తితే అది అరేబియా తరంగ దైర్ఘ్యమయ్యింది
ఎర్ర త్రికోణంలా
నది చాలా అందంగా ఉంటుంది
లోపల పుచ్చిన ఎయిడ్సు గజ్జీ ఉంటుంది
తవ్వకపోయినా నదిలో
అబద్దాల శిలాజాలు దొరుకుతూనే ఉంటాయి
అడక్కపోయినా నది
ఎన్నో ఐకమత్యాల వీరగాథలు వినిపిస్తూనే ఉంటుంది
నది తన అందమైన దేవనాగరి భాషలో
ఎక్కన్నుండో ఆర్యులొచ్చారంటుంది
అభూతకల్పోనల్ని పాఠ్యపుస్తకాలకెక్కించి
అన్నెంపున్నెం ఎరగని పసిమెదళ్ళని కల్తీచేస్తుంటుంది
నది తన తండ్రి పురుషుడంటుంది
తన తల్లి పురుషసూక్తమంటుంది
మనుధర్మ శాస్త్రపు చీముపట్టిన పుండు
తన జన్మస్థానమంటుంది
ఇదొక విచిత్ర విషాద జంతువు
పాపం పాదంతో ఒంటేలు పోసుకుంటూ ఉంటుంది
పాదంతో వ్యభిచరిస్తూ ఉంటుంది
పాదంతో పిల్లని కంటుంది
ఊరవతల మురికి వాడల్లోకి తన్నేస్తుంటుంది
ఇది నన్ను కీటకాన్ని చేసింది
నా చుట్టూ స్మృతుల గుల్లని కట్టి
నన్నో నత్తని చేసి తీరానికవతల విసిరేసింది
ఇప్పుడీనది
ప్రార్థనా స్థలాలకింద దేవాలయాల గుర్తులు వెదుక్కుంటూ
కొత్తగా మొలిచిన ఆరో వేల్తో
తన పురాతన గాయాన్ని తీరిగ్గా కెలుక్కుంటూ కూచుంది
ఒసే గోదావరీ!
నేనేం చేసానే నన్నిట్టా అన్నాయెం చేసినావూ!
3
నదీలోయల్లో
నాగరికతలిఉ బయల్పడతాయని చదివాను
నదీ తీరాల్లో
సంస్కృతుల శకలాలు దొరుకుతాయని విన్నాను
కానీ
గోదావరిని తవ్వితే
నాకొక శివలింగం దొరికింది
ఒక పోశుపతి దొరికడు
ఒక కుళ్ళిపోయిన రామ పాదుక దొరికింది
రామపాదుకనంటిన శతాబ్దాల నెత్తుటి మరకలు దొరికాయి
నెత్తుటిమరకలు రాయని అస్పృశ్య ఆత్మ కథలు దొరికాయి
ఆత్మకథల పుటల్లో కన్నీటి కొండలు దొరికాయి
ఎక్కడతవ్వినా పులిపంజాల శిలాజాలేతప్ప
మనిషి ఆనవాలే దొరకటం లేదు
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే
గోదావరికి మూడు కోరలు కలవు
పది పిర్రలు కలవు
ముక్కోటి తోకలు కలవు
ఒళ్ళంతా బూడిద పులుముకున్న గోదావరి
నేనొక జీవన విధానాన్నని
ఒక సంస్కృతిననీ బుకాయిస్తూంటుంది
తన కచ్చనంతా ధర్మశాస్త్రంగా విధించి
ఇదంతా మీ సుఖం కోసమేనంటుంది
ఆడోళ్ళ గుడ్డలెత్తుకపోయినోడిముందు
మోకరిల్లి మహా హారతులు పట్టమంటుంది
బ్రాహ్మల మేలుకోసం నాకు రాక్షసత్వం అంటకట్టి
నన్నో కొబ్బరికాయగా శపించినోళ్ళకాళ్ళ దగ్గర
తలపగలగొట్టుకోమంటుంది
ఒకపక్క వరాలిచ్చి – మరొకపక్క
కొత్త అవతారాలెత్తి చంపే మోసగాళ్ళని నమ్మమంటుంది
అడ్డమైన కట్టుకథల్ని నమ్మి చెక్క భజనలు చేయమంటుంది
గోదావరి
తను తప్ప మరొక్క పిల్ల కాలువైనా ఇక్కడపారడానికి
వీలేలేదంటుంది
హిందుస్థాన్ చోడ్ దో అని
గోడగొంతుకలేసుకు మొరుగుతూ ఉంటుంది
పైకి లౌకికత్వపు నీళ్ళతోలు కప్పుకున్నా
కళ్లలో ముళ్ళవలలు పరిచి నిఘావేస్తూంటుంది
గోదావరి ఉరఫ్ సరయు
గోదావరి అలియాస్ తుంగభద్ర
ఏ చౌరస్తాలోకైనా వెళ్ళు
సత్రం ఆవుకుమల్లే దారికడ్డంగా నెమరేస్తూంటుంది గోదావరి
బహుముఖాల గోదావరికి
కొన్ని చోట్ల నిక్కర్లుంటాయి
చేతుల్లో లఠీలుంటాయి
పలుగులుంటాయి, సారాపేకెట్లుంటాయి!
గంజాయి గొట్టాలుంటాయి
చట్తంగా, న్యాయంగా, అధికారికంగా ముసుగు తొడుక్కొని
వాడల్ని ఊచకోత కోస్తున్నా
ఈద్గల్ని ఖరాబు చేస్తున్నా
కళ్ళలో మర్మాంగాలు పెట్టుకు నిద్ర నటిస్తుంది
సాక్షాత్తూ దేశనాయకులే
గోదావరి కాళ్ళమీదపడి వాడి వీర్యావశేషాలని నాకుతుంటే
వాడు ఒళ్ళు ఒలవకుండా ఎట్టాఉంటది!
ఇక ఇట్టా కాదుగానీ! పదరా సిన్నోడా, తాడోపేడో తేల్చుకుందాం!
4
మీ పీతిగుడ్డలు ఉసిమీ ఉసిమీ
సివరాకరికో కన్నీటినదినైన తిప్పణ్ణే మాట్టాడుతున్నాను
అహాహా! ఏం తెలివి పుట్టుకొచ్చిందే నీకు గోదావరీ
ఏదీ నీ ముఖం చూపించమంటే
ఎత్తిపోతలపథకాలు చూపిస్తావా?
అయినా
నాకు నీ మొఖంలో ఎడార్లే కనిపిస్తున్నాయి
రైల్వేస్టేషన్ ముందు రిక్షాలోనే సోయి తప్పిన సామేలే
అగపడతన్నాడు
దూరంగా కూలుతున్న గవర్నమెంటు వెలికాలనీలే కనిపిస్తున్నాయి
అవును నీ బొచ్చుగొరిగీ నీ చంకలు చేసీ
ఏదీ నీ పేరు చెప్పమంటే
సింఢూ అంటావా
గంగ అంటావా
కృష్ణవేణంటావాసివరికో సబ్బునీళ్ల బుడ్డినైపోయిన గోయిందునే గోదావరీ
కానీ- నాకు మాత్రం
తిమ్మసముద్రమనీ
నీరుకొండనీ
కీలవేన్మణనే వినిపిస్తుంటుంది
నా తోలునే నానేసి ఊరేసి
సివరికో తోలుతొట్టినైన
అబ్బురాంనే మాట్లాడుతున్నాను గోదావరీ!
ఎవర్నువ్వంటే
నర్మదనంటావో
తుంగభద్రనంటావో
బ్రహ్మపుత్రనంటావో
-కానీ
నువ్వు బోరింగుపాపవి గోదావరీ
మూసీ ప్రసవించిన సింగిల్ నంబర్ లాటరీవి
ఈజీ ఇన్ స్టల్మెంట్ స్కీములాంటి కన్నీటి శిస్తువి
వొసే వైతరణీ
నాకు నీ కాళ్ళు కడగటమే కులవృత్తన్నావ్
నీ ఎంగిలి సల్లే నాకు పరమాణమన్నావ్
నీ మోచేతినీళ్లకోసం నన్నో ఆకొన్న కుక్కని చేసావ్
నువ్వు ఏసీ లో దొర్లాడుతూ
నన్ను మూసీల్లో పొర్లించి పొర్లించి తన్నావ్
నువ్వు కుభేరుడివైపోయి
నన్ను కుచేలున్ని చేశేశావు
ఒసే రూపాయి మొఖందానా, గోదావరీ
ఏందే నీ హక్కూ! ఏందే నీ ఆమీ!
నీకూ నాకూ ఒకే రూపాయి చలామనీ అవుతున్నా
నీ దప్పిక మినరల్ వాటర్లతో తీరటమేంది?
నేను గొంతెండి చావటమేంది?
ఏందే గోదావరీ! ఈ అన్నాయేం?
నీ తోలొలిచి కొత్త కరెన్సీ ముదిస్తున్నా
ఇక బతుకు మీద రూపాయికి ఇంతైనా హక్కు లేదు
లేదంతే!
5
కదిలడే ఆనీడెవరూ!
ఎవురంటే పలకరేం!
ఏయ్! ఆగు..అగక్కడ…
ఎవడ్రా వాడూ!
ఆదమరిచి నిద్రబోతున్న నా ఎదుర్రొమ్ముల మీద కూకోని
మొండికత్తితో నా పీకెని పరపరా కోసుకుంటందెవుడు?
నా గుండెలో గడ్డపారలు దిగేసి
చిమ్మిచ్చికొట్టిన నా నెత్తురుతో ముఖం కడుక్కుంటందెవుడు?
నా శవం పక్కనే కూకోని
నన్ను కరుగులుగా ఏపుకోని తింటందెవుడు?
నా గుండె నా కార్జం నా ఉలవకాయలూ నా నెరెడ
నామెదడూ నా ఊపిరితిత్తులూ.. ఎవరెత్తకపోయార్రా
నా కళ్ళలో మేకులు దిగ్గొట్టి జన తాగుతుందోడు?
నా తోలు తీసి ఉప్పుకారం అద్దుకోని చప్పరిస్తందెవుడు?
నన్ను తెల్లారుఝాముని చేసి చెట్లక్కట్టి
నా ఒళ్ళంతా తూటాల జల్లెడ జేసి
నా ముకం మీద తుపుక్కున ఉమ్మేసి పోయిందోడ్రా!
ఎవుడి సుట్టనిప్పుకోసంరా నా గుడిశె తగలబడతందీ
ఎవుడి కత్తిరా ఇది నా పిల్లగాల్ల కుతికెల మీద!
ఎవడ్రావాడూ!
నా పెళ్లాం గుడ్డలూడదీసి
పరమకిరాతకంగా దాన్ని సెరసీ
అది అల్లాడతంటే పగలబడి నవ్వుతుంది ఎవుడు?
నువ్వు…నువ్వా గోదావరీ!
6
ఆకలి కడుపుకీ అన్నమ్ముద్దకీ మధ్య
అష్టమహా సముద్రాలున్నవాడ్ని
ఒకే ఒక్క రొట్టెముక్క కిఓసం
దత్తు పోయిన నీ ఆఖరి కొడుకుని
కాలే కడుపుకింత గంజి కావాలి గోదావరీ
టిప్పూ సుల్తాన్ సీరియళ్ళూ
ప్రత్యేక రక్షన చట్టాలూ కాదు
గుర్తుందా గోదావరీ
నాకూటిగిన్నెని నీవు తన్నుక పోతున్నప్పుడు
అతను నన్ను వలీమాకి పిలిచాడు
నువ్ నన్ను మెడబట్టి బైటికి గెంటేసినప్పుడు
అతను లోపలికి రా అక్కడే నిలబడతావేం అన్నాడు
వెళ్ళకుండా- ఇక్కడే శిలేసుకోని ఉండటానికి
నాకు నమ్మకమేది గోదావరీ! హామీ యేదీ హక్కులేవి?
దేవుడ్ని పాలలో కడుక్కున్నంత కసిగా
నా బొల్లకాయని సుంతీ చేసుకున్నాను
సింలా సర్దిపుచ్చుళ్ళైపోయి
రాడ్క్లిఫ్ పారీ కత్తులు రాసేసుకున్నాక
ఇప్పుడు ముప్పైమూడోనాడు కూడా
నేన్నీకు శాశ్వత శత్రువునే కదా గోదావరీ
నేను ప్రార్థన చేసుకుంటూంటే తురకోడు ఏడుస్తున్నాదంటావు
నీ దెయ్యాలకి మొక్కకపోతే
ఈ నేలేందో నీయమ్మ మొగుడిసొమ్మైనట్టు
నన్నీదెశంవిడిచి పొమ్మంటావు
నన్ను తవ్వి పాది చేసినా నెత్తురే తడికట్టి
శిలాన్యాసాల అటవీపథకాలు ప్రారంభిస్తూంటావు
నా శవల మెట్లమీదుగా వెళ్ళి
నిన్నెవరో వంచించినట్టూ, న్మ్మకద్రోహం చేసినట్టు నమ్మించి
నిన్ను నీవే నిషేదించుకున్నట్టూ బర్థ్ రఫ్ చేసుకుంటున్నట్టు నటించి
జనవరి ఇరవయ్యార్ల బరిసెలు
నా మాడుమీద దిగ్గొట్టి జెండాలు ఎగరేస్తుంటావు
నా చినిగిపోయిన కుర్తాల సాక్షి సాక్షిగా
నీకు గుడ్డలు కుట్టీ కుట్టీ
మొలల్తో నా ముడ్డి తీపుతీసుకుంది
నా ఎండుచాపల గబ్బు సాక్షిగా
నీవ్యభిచార శయ్యలకు పూలమాలలు కట్టీ కట్టీ
ముళ్ళుదిగిన చేతుల్లోంచి కన్నీళ్ళొస్తునయి
నీ నాలుగుతలల సిం హం మాంసం ముక్కని
నీ కాషాయగణాల మధ్య ఎంగిలి విస్తరిని
నేను గాయాన్ని గోదావరీ
నువ్ నా జిప్పులాగేసి కసుక్కున కుమ్మితే
అల్లా అంటూ ఆరిపోయిన గాయాన్ని
నువ్ కూల్చితే కూలిపోయిన గాయాన్ని
అవునూ!
బాబర్ కీ నాకూ చుట్టరికమేమిటీ
ఒసీంకీ నాకూ సంబంధమెమిటీ
చోర్ చినాల్!
ఒక్కసారి నెత్తురు చూడవే! ఇదినీదే!నీదేనే!
7
నిజమే మరి
రామాయణం రాసింది నువ్వేకదూ
మహాభారతం రాసిందీ
భారతరాజ్యాంగం రాసిందీ
నీ విధ్యాపాటవానికి భీతిల్లి సిగ్గులేని దక్షిణలడుక్కుందీ
నువ్వెక్కడ పాలపుంతల్ని కిరీటం చేసుకుంటావోననీ
నిన్నూ అస్పృశ్యపాతాళానికి తొక్కేసిందీ నేనేనాయే
నీకు గాయత్రిని నిషేదించి
నీచవృత్తుల నిరక్షరత్వంలోకి నిన్ను తోసేసి….
అంతా ఒక పథకం ప్రకారం చేసింది నేను కాదు మరీ!
నీలో ఎక్కడన్నా ఒక్క మేధావి కనిపించినా
యేసుపాదం అని పేరెట్టుకుంటే మాకూ వస్తాయి ఉజ్జోగాలని
నిన్నూ నీ ప్రతిభనీ వెకిలిగా యెద్దేవా చేయటమే ప్రతిభగా
కేవలం ప్రతిభగా చాటుకుందీ నేనేనాయే
జనం నవ్వుతారు గోదావరీ… నోటితో కాదు
అయినా, అమ్మపుట్టిళ్ళు మేనమామకెరికని
నీ సంగతీ నీ ప్రతిభ సంగతీ నాకు తెలియదా గోదావరీ
నీ పీజీ డిగ్రీచేత్తో సంతకం చేస్తే పది పెన్నులిరగటం
నీ ఫస్ట్క్లాస్ ధర్మామీటర్ తగిలితేనే రోగి ఠకీల్న చావటం
కనీసం నీ మెరిట్ నినాదాన్నైనా శుభ్రంగా రాయలేకపోవటం
ఒక జాతిజాతినే చదువుకి వెలేసి
అముద మహావృక్షంగా చంకలు బాదుకోవటం
ఇదంతా నీ ప్రతిభే గోదావరీ! నీ ప్రతిభే
నీ ప్రతిభ తూముకూరు BE
నీ ప్రతిభ మహారాష్ట్ర MBA
 రూపాయి విలువ గ్రాఫు రసాతలంలోకి దూకిచావటం
సివిల సర్వీస్ పరీక్షల్లో సైతం చిట్టీలు పెట్టడం
ఎంత గొప్ప ప్రతిభేనీది గోదావరీ!
చాటుకో గోదావరీ! చాటుకో!
విఫలమౌతున్న నీ అంతరిక్ష ప్రయోగాలూ
ఆర్పలేని బ్లోఅవుట్ ప్రమాదాలూ
నీ కిడ్నీ దొంగతనాలూ
నీ జలగావ్ లంజతనాలూ
అన్నింటినీ అన్నింటినీ నీ గాజుగుడ్డకింద కప్పెట్టి
నీ మేధ పుష్పకవిమానమనీ
నువు ఆర్యబట్టకు గర్భసంచీవనీ
చరకుడు ప్రపంచానికే జేష్ట వైధ్యుడనీ చాటుకో
అన్నిటినీ మించి
ఈ ఈగలమోతని పల్లకీ మోతగా
ఈ మున్సిపాలిటీని నీ పర్సనాలిటీగా చంకలు గుద్దుకో
ఇంతకీ చెప్పొచ్చేదేమంటే గోదావరీ
ప్రతిభ నీ అయ్యసొత్తు కాదుకదా
నీ కపాలం లో కంప్యూటరూ
నా బుర్రలో సుద్దముక్కలూ పుట్టలేదు కదా
నువ్వొక్కదానివే నదివీ నేను ఎడారినీ కాదుకదా
నువ్వు ఆకాశానివి కాదు అలాహని నేనూ పాతాళాన్నీ కాదుకదా!
మరి-
ఇన్నాళ్ళూ ఈ అబద్దాల్ని నిజంగా చాటిన నువ్వు పశువ్వే కదా!
తల్లీ పశువా! మన్నించు నిన్నీ గోదావరితో పోల్చాను
8
పల్లెటూరంటే
పచ్చని పొలాల సస్యదృశ్యంకదా చూపుకందాలి!
దేశమంటే
రెపరెపలాడే జెండాల్లాంటి మనుషులుకదా కళ్ళముందు
మెదలాలి!
కన్నెపిల్లల సంక్రాంతి ముగ్గులు ఆహ్వానం పలకాల్సిన వీధుల్లో
ఈ జీపుటైరు గుర్తులేమిటి గోదావరీ
ఈ బూటునాడాల ముద్రలేమిటి?
అర్థరాత్రి మంచిర్యాలలో బస్సుదిగటానికి ఎవరైనా ఎందుకు భయపడాలి గోదావరీ!
పట్టపగలు తెలంగాణా గగనతలంలొ ఎగరటానికి
పాలపిట్టలైనా ఎందుకు నిరాకరించాలి ?
గుండెలు జలదరించే ఈ స్మశాన నిశ్శబ్దమేమిటీ
ఈ వార్తా పత్రికల నిండా నెత్తురు మరకలేమిటీ
ఎవరికోసం వెతుక్కుంటున్నారు గోదావరీ –
ఈ తల్లులీ తుప్పల్లో దిబ్బల్లో – ఎవరికోసం ?
ఒకడు భూమికి మొగుడవుట ఏమిటీ
మరొకడు వాడికి బాంచ కావటం ఏమిటీ
ఈ హత్యల్ని ఎన్ కౌటర్లంటున్న గాడిద కొడుకులోరు?
ఇక్కడ ప్రాథమిక హక్కులున్న పౌరులెవరు?
దీన్నెవరు గోదావరీ! దేశమంటారు?
ఈ నిఘాలేమిటీ
ఈ సోదాలేమిటీ
ఈ చిత్ర హింసలేమిటీ
ఎవడి సౌభాగ్యం కోసం గోదావరీ ఈ చట్టబద్ద హింస
ఎవడి సౌఖ్యం కోసం ఈ వేట ?
ముద్ద కూడడిగితే కుట్ర
గుక్కెడు నీళ్ళడిగితే ద్రోహం
ఇదేం బతుకంటే తీవ్రవాదం
ఎవడి భూమిని వాడు అడగటమే నేరమైతే
ముందు సీతారామరాజుని కదా దేశద్రోహిగా ప్రకటించాలి
తిరగబడి ప్రశ్నించటమే దేశద్రోహమైతే
ముందు భగత్సింగుని కదా నేరస్తున్ని చేసి వెలెయ్యాలి !
ఏంటి గోదవరీ!
ఈ తెగుతున్న మంగళసూత్రాలేమిటీ
ఈ అడుక్కుంటున్న అనాధ బాల్యాలేమిటీ?
ఈ టార్చర్లేమిటీ!
ఈ గాలింపులేమిటీ!
ఈ పటాలాల మోహరింపులేమిటీ?
గోదావరీ!గోదావరీ!
వీళ్లంతా ప్రాణాలొడ్డి పోరాటాలెందుకు చేస్తున్నారంటావ్?
వీళ్ళంతా మందు పాతర్లై ఎందుకు పేలుతున్నారంటావ్?
ఒసే ఎండిపోని నెత్తుటి కాలవా
కుళ్ళుతున్న శవాల దిబ్బా
ఇదేనా ప్రజాస్వామ్యం?
ఇదేనా నాగరికత?
ఇదేనా స్వేచ్చా జీవితం ?
అమ్మా! మా తల్లీ!నీకూ నీ స్వేచ్చకో దణ్ణం
నేనొక కల్వర్టునై పేలైనా సరే
ఒక కొత్త సూర్యున్ని ప్రసవిస్తాను! అది నా అవసరం
9
నాకంతా గుర్తే గోదావరీ
అమ్మ గర్భసంచీలో నా దేహాన్ని కూడదీసుకుంటున్నప్పుడే
నాకేసి నీ స్కానింగ్ కళ్లతో ఉరిమి చూశావ్
అన్నయ్యకి అమూల్ మిల్కులు తాపి
నన్ను మాత్రం అమ్మ బీడురొమ్ములకే విడిశావు
వాడికి జేబు కుట్టించి
నన్ను దేబరించమన్నావ్ వడికి పేరాచొట్ట్లు కొనిచ్చి
నా రెక్కలు కత్తిరించి నన్నో ఆకొన్న కుక్కని చేసావ్
మర్చిపోయాననుకున్నావా గోదావరంకుల్
ఆరేళ్లవయస్సులో ఆడుకుంటూ మీ ఇంటికొస్తే నువ్ చేసిన లేకి పనులు
చదువు చెప్పయ్యా అని నీ దగ్గరికొస్తే
బుగ్గలు పిసకటాలూ, లేత భుజాలు పిండటాలు
హోళీ ఆడినట్టుగా నా ముతకలంగా నిండా నెత్తురైతే
దగ్గరికి తీసుకోవాల్సింది – నన్ను దూరంగా మూలన
కూర్చోబెట్టటాలూ
నాకన్నీ గుర్తే గోదావరీ!
నేను పెద్దగా నవ్వితే బెల్టు తీశావు
నా పదోతరగతి పుస్తకాల్లో ప్రేమలేఖలకోసం సోదా చేసావు
కిక్కిరిసిన బస్సు చీకట్లో నా కాలుతొక్కి యాడేడో తడిమావు
నా మేరక వీధి మర్మాంగంలో సీసాలు జొనిపి ఇకిలించావు
తెరమీద నా గుడ్డలూడదీసి డబ్బులేరుకుంటున్నావు
తెరవెనుక నన్ను తొనలు తొనలుగా మాగేసి తింటున్నావు
గోదావరీ!
అప్పటిదాకా ఏ మగపిల్లవాడితో మాట్లాడినా అనుమానించి
కాపలా కాసి
తొలి రాత్రి బతిమాలి లోపలేసి –
మర్నాడు తొడల్లో పచ్చి పుఇండై నేను మొరాయిస్తే
బలంతాన నన్ను – కసిరి, తిట్టి, లోపలికి నెట్టి గెడియేస్తే
వాడు తన మొగతనాన్ని చూపించుకోవటానికి
నన్ను పడుకోబెట్టీ, కూచో బెట్టీ, నించోబెట్టీ…
ఊగీ ఊగీ ఊగీ.. ఎంతసేపు..ఎంతసేపు..?
గుండెలవిసి పోతున్నాయండీ
గొంతు తడారిపోతుంది!
సెమటదడ… వీర్యం..నెప్పి…నెత్తురు
పురుషాంగం! పురుషాంగం..అమ్మో భయం
కొరకొద్దుప్లీజ్! రక్కొద్దు ప్లీజ్! అబ్బా కాల్చొద్దు.. అమ్మా!
మీకు దణ్ణం పెడతా ఆగండీ!ఆగండీ…ఆగండీ
ఆగు…ఆగరా పశువా!
ఎవడ్రావడూ ! న స్త్రీ స్వతంత్రమర్హతీ అన్నదెవడు?
బెలన్నదీ అబలన్నదీ అవని అన్నదీ ఎవడూ
దాసి అన్నదేవడూ మంత్రన్నదెవడు? రంభన్నదెవడూ?
ఈ సంసార వ్యభిచారాన్ని కవిత్వం చేస్తే
ఒక నాబట్ట నాది నీలి కవిత్వం అంటాడా!
మరొక ముట్టుబట్ట నాకు ఒళ్ళు బలిసిందంటాడా!
నేను లక్ష్మణ రేఖలు చిటికెనేళ్ళతో చెరిపేస్తూంటే
నాకు అక్రమ సంబందాలంటగడతాడా!
నన్ను గడిమీరిందంటడా? గడేందిరా! గడేందంటా!
ఒసే! సదూకున్న సెల్లెళ్ళారా !
వాడిక్కూడా ముట్లొచ్చి కడుపొచ్చే మార్గం కనుక్కోండి
కనీసం అప్పుడైనా ఈ గోదావరి గాడికి
ఆడదంటే అంగం కాక ఒక మనిషయినా కనిపిస్తుందేమో!
 10
ఎప్పుడో తెగిపోయిన నరాన్నిప్పుడు ముడేస్తే
పాయలైపోయిన నెత్తురు కలిసిపోయి ప్రవహిస్తుందంటారా!
ఎంత కరిగించి మూసపోసినా- బద్దలైన అద్దంలో
మళ్ళీ ప్రతిబింబం రూపుకడుతుందంటారా?
కుస్తీ మొదలవ్వకుండానే ఉండాలి!
గెలుపు రుచీ
ఓటమి కోతా అనుభవానికి రాకుండానే ఉండాలి
ఇప్పుడీ అద్దమద్దెరాన అట ఆపేద్దామంటే ఎట్టా?
ఏమో! నేనే గెలుస్తానేమో !
నేను కొనుక్కున్న కుంకాన్ని ఇప్పుడు పారబోయమంటే ఎట్టా?
ఒద్దురా ఈ సావుబతుకులాటని
నెత్తీనోరూ బాదుకొని మొత్తుకుంటే ఇనిపిచ్చుకున్నావ?
ఒక పక్క నేను బరి చెరిపేస్తూంటే నువ్వు సున్నపు బొచ్చెల్తో తయారూ!
ఒక పక్క నేను చెయ్యి చాస్తూంటే కాలిన పేగులా నువ్వు ముడసకపోవటాలూ!
అదికాదురా! నాకు తెలీకడుగుతానూ
నా పక్కన కూకోని బువ్వతింటే
నీ ఆకులో మెతుకులు పురుగులవుతాయా?
నీ ఆడకూతుర్ని నేను మనువాడితే
నా ఇంద్రియం నీళ్లైపోతదా?
వాణి అంటుబడిందని గుండెల్లో బాకులు కుమ్మావే
సెయ్యాల్సిన తప్పుడు పోనులన్నీ సేసి నన్ను నాశనం చేసావే!
ఇప్పుడు
నేనే నిన్ను కలుపుకోవాలని పోవాలంటే
నాకేంబట్టిందీ!
కందకి లేని దురద కత్తిపీటకెందుకుండాలి?
నేరస్థుడివి నువ్వు!
ప్రాయశ్చిత్తమో, పశ్చ్చాతాపమో ప్రకటించాల్సింది నువ్వు !
నీ అధర్మ శాస్త్రాల్ని తగలబెట్టి
నీ జంధ్యప్పోగులు తెంచేసుకొని
నీ మడిగుడ్డలన్నీ ఇడిసేసి
నా నేల గుడిశెముందు
నా సినిగి పోయిన గోసి గుడ్డముందు
నా మట్టికాళ్ళ ముందు వినమ్రంగా మోకరిల్లి
మారు మనసు పొందాల్సింది నువ్వు
అయ్యా బాబని అంగలారుస్తూ సెమాపణలు వేడుకోవాల్సింది నువ్వు!
నీ ఈ ఎదవ పుటకని సంపి
కన్నీటి బాప్తిస్మంలోంచి
ఒక నిజమైన మనిషిగా మళ్ళీ పుట్టి – రా దగ్గరికిరా
తడికె కాదు గుండె తెరుస్తా
నీళ్ళుకాదు ఆనంద భాష్పాలందిస్తా
బువ్వకాదు నా బతుకు అంబలి వడ్డిస్తా
నాకుక్కిమంచంలో నీకు సోటిస్తా
రా గోదావరీ! రా
ఏం? నీ దేవుడూ నీ లంజమొగుళ్ళూ నిన్నొదల్టం లేదా!
11
పాడెని చూస్తన్నాను
నాసికా త్రయంబకం నుండీ నన్నయ పాదాలదాకా విస్తరించిన
గొప్ప ప్రజాస్వామిక పడెని చూస్తున్నాను
నదిని చూస్తన్నాను
కోతకు గురవ్వటమే కాదు – కోయటమూ తెలిసిన ఒడ్డు
తిరగబడ్డప్పుడు
ఒక శవమై తేలిపొయిన జీవనదిని చూస్తన్నాను
ఒక అసమగ్ర శవపు దహనం కోసం
చితిగా గుట్ట పడిన మనవ సమూహాన్ని చూస్తన్నాను!
అయ్యయ్యో గోదావరీ! చచ్చిపోయావా గోదావరీ!
చంపితే నువ్వు చస్తావని ఆ పనేదో నా చేతుల మీదుగానే కానిద్దును కదా
పాపం! బతికున్న రోజుల్లో ఎన్ని ఎచ్చులు పోయావో
ఈ తుమ్మ మొద్దులే కదా! మమ్మల్ని తుంగ బధ్రల్లో తొక్కిందీ
ఈ కమండలాలే కదా!
మా పిర్రలు, నలికెలూ, సిగ్గులూ తెగ్గోసి
మా సెల్లెల్ల పైటల్లాగి పరాసికాలాడిందీ!
ఇప్పుడు నా ఇంటెనకాల ఒక శవంగా మిగిలిపోయావా గోదావరీ
అనుకున్నావు గానీ
సరిగ్గా నాగుండెలకేసీ బాణం వదిల్తే
శంబూకుడు కాదు
చచ్చింది నువ్వే గోదావరీ!
నల్లమందు మగతలో
నువ్వు గాట్టిగా ఏసిన గడ్డపొలుగు గాతం
మజీదు గోపురంలో కాదు
దిగబడింది నీ పునాదిలోనే గోదావరీ
నిజానికు! నువ్వెప్పుడో చచ్చిపోయావు గోదావరీ!
పాపం!
నిననే కదా కోటిపల్లి బస్టాండ్లో కలిసి
యాంటీ రిజర్వేషన్ ఊరేగింపుతీద్దామన్నావు!
ఉదయమేకదా గోదావరీ! ప్రాంతీయవార్తల్తో
నన్నీదేశాన్నుండే ఏరేస్తానని హామీ ఇచ్చావు
ఇంతలోనే నిన్నూ నీ అహంకారాన్నీ
సిటికెనేలుతో కూలదోసిన మొగోడెవ్వడు గోదావరీ!
ఆ మారాజెవురో తెలిస్తే
వాడిమెళ్ళో ఒక నిలువెత్తు మానవ హారం ఏద్దును కదా !
వాడ్ని నాభుజాలకెత్తుకొని పొలోమని ఊరేగుదునుకదా
వాడి కాళ్ళమీద బొక్కబోళ్ళాపడి నా కన్నీళ్ళతో కడుగుదును కదా
ఒరే! నా ప్రియమైన హంతకుడా!బాబా!
యుద్దంలో అలసి ఏ సెట్టునీడన విశ్రాంతిలో ఉన్నావయ్యా!
రా! రారా! ఒక్కసారి నాకగపడరా!
నీ గంభీర రూపాన్ని కళ్ళనిండా చూసుకోవాలిరా తండ్రీ
నీతుది గాయాలకి నా పెదాలతో ప్రేమలేపనాలు అద్దాలి రా అయ్యా!
నిన్ను గట్టిగా వాటేసుకొని కడుపారా ఏడ్సుకోవాలిరా బాబా!
ఒసే గోదావరీ!
నీ అస్తికల్ని మా పిల్లలు ఉచ్చకాల్వల్లో పారబొయ్యటాన్ని
నేనిప్పుడు నా పెద్దలమీది శాశ్వితమైన నవ్వుసాక్షిగా చూస్తన్నాను!
ఒక కొత్త భారతదేశం
చిగురుతొడగటానికి
నా శ్వాసనే సాక్షిగా ప్రకటిస్తున్నాను
12
కలే కావొచ్చు!
అధివాస్తవమైన బలీయమైన కోరికే కావొచ్చు!
ఇప్పుడిప్పుడే నిజం కాలేని భ్రమే కావొచ్చు!
నిజానికిక్కడ ఒక మహా భూకంపమే అవసరం కావొచ్చు!
అయినా
నేనిప్పుడు గోదావరిలేని ఒక అద్బుత సమాజాన్ని ఊహ చేస్తున్నాను
మనిషీ!
నీకు స్వాగతం పలుకుతున్నాను
 గోదావరి తేమనంతా మానవత్వపు సూర్య రశ్మిలో ఎండగట్టి
ప్రాణవాయువులా నడిచొస్తున్న మానవుడా –
నీకోసం- నీ నగేష్ బాబు ఇక్కడ
ఆనద భాష్పాల తోరణాలు కడుతున్నాడు- రా!
మిత్రుడా!
మా అనసూయమ్మ అరిసెలు చేసి
మాకు కనీసం రుచైనా చూపించకుండా
నీకోసమే దాచిపెట్టింది- రా తిందాం
నా భార్య విజయ శ్రీ
మనం కల్సి తినబోయే భోజనాల చాపమీదకి
పప్పుచారూ, ఉప్పుచేప కాల్చి సిద్దం చేసింది! రా నంజుకుందాం!
నా ప్రియమైన శర్మా!
ఈ సొలస మాదిగపల్లి మాలపల్లి తురకపాలెం మొత్తం
నీ కోసం ఊరి గవిట్లో కళ్ళలో వత్తులేసుకున్నాయి
నా చిట్టి తల్లీ, నీ ఒక్కగానొక్క కొడుకూ కలిసి
ఒక కొత్త సృష్టి చేస్తామంటున్నారా !
గుండెల్ని చేతులు చేసి దీవిద్దాం! వచ్చెయ్!
ఆ మహా సంబరానికి- తొలిసారిగా
హలాల్ చేయని బిర్యానీ చేస్తానంటున్నాడు ఖాజా
మన చుట్టూ కమ్ముకున్న నీలి మేఘాలన్నీ
చల్లని ఆశిస్సుల చినుకుల్ని చిలకరిస్తామంటున్నాయి
రండిరా బాబూ! అలా చూస్తూ నిల్చుంటారేం!
రండి దమ్ము చేద్దాం! నారుపోద్దాం! నాటదాం! పంటకోద్దాం!
కలో గంజో మనమంతా కలసి తలాకూసింత సమానంగా తాగుతూంటే
చివరిసారిగా మన దండకారణ్యం
విజయ సూచికగా గాల్లోకి కొమ్మలెత్తి కాల్చుతానంటోంది
శర్మా!
నువ్వు రాగానే నిన్ను మనసారా కౌగంచుకుంటాను
అప్పుడు మన కళ్ళలో చిందే పవిత్ర జలంతో
ఈ తప్పుడు చరిత్రనంతా కడిగేద్దాం!
త్వరగా వచ్చేయ్ మిత్రమా!
నీకూ నాకూ మధ్య వింధ్య పర్వతాలైన ఈ దేవుళ్ళని నాశనం చేద్దాం!
నీలో భాస్వరమూ, నాలో గంధకమూ పెట్టిన మనువు గాడ్ని
దిగంతాలకవతలిదాకా తరిమి తరిమి కొడదాం
శర్మా! ఈ పోరాటాలూ కవిత్వాలూ అక్కర్లేని ఒక ఆశ్చర్యాన్ని
రచిద్దామా!
అవునూ! నువ్ నీ పసుపునీళ్ళ మరచెంబునీ! పడేశావటకదా
మా చెల్లెమ్మ చెప్పింది లే
నువ్వొచ్చే దారిలో చిల్లకంపల్నేరి చదును చేసాను చూశావా!
అగ్గిపెట్టె ఉందా మిత్రమా!
కనీసం ఒకప్పుడీ నేలమీద రాజ్యం ఉండేదన్న నిజం
మనపిల్లలకు పిట్ట కథగానైనా తెలియటానికి వీల్లేదు !
అటుచూడు శర్మా!
ఈ రోజు కొత్తపొద్దు పొడుస్తున్నట్టులేదూ…