వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది పాప. ప్లీజ్‌ కొంచెం సేపు మాట్లాడు. టెన్షన్‌గా ఉంది. ఇక్కడ ఎవరు లేరు. ఏడుపు వస్తోంది.. చాలా భయంగా ఉంది. కొంచెం సేపు మాట్లాడు పాప‘.. అంటూ నిస్సహాయ స్థితిలో ప్రియాంక తన చెల్లితో మాట్లాడిన చివరి మాటలు అందరికీ కన్నీళ్ళు తెప్పించాయి. ఆమె అడవిలో క్రూర మృగాల మధ్య లేదు. మనతో పాటు మనుషుల మధ్యనే వుంది నిన్నటిదాకా. కానీ ఇప్పుడు…

ప్రియాంక రెడ్డి పశు వైద్యురాలు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబ్‌ పేటలో పనిచేస్తుంది. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కోడేరు మండలం నర్సాయపల్లి ఆమె సొంతూరు. ఈ కుటుంబం శంషాబాద్‌లో నివాసం ఉంటోంది. ప్రియాంక చెల్లెలు భవ్య శంషాబాద్‌ విమానాశ్రయంలో పనిచేస్తుంది. ప్రియాంక బుధవారం సాయంత్రం గచ్చిబౌలి వెళ్ళింది. సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయల్దేరి శంషాబాద్‌ దగ్గర తొండుపల్లి టోల్‌ ప్లాజాకి కాస్త దూరంలో బండి పెట్టి అక్కడి నుంచి క్యాబ్‌లో బయలు దేరింది. రాత్రి 9 గంటల సమయంలో తిరిగి ప్లాజా దగ్గరకు చేరుకుంది. అప్పుడే ప్రియాంకతో ఆమె చెల్లి ఫోన్లో మాట్లాడింది. తిరిగి రాత్రి 9.44 ప్రాంతంలో చెల్లెలు మళ్లీ కాల్‌ చేస్తే ఫోన్‌ స్విచాఫ్‌ అయింది. తెల్లవారే సరికి ప్రియాంక దారుణ హత్యకు గురయి మంటల్లో కాలి బూడిదవుతూ కనిపించింది. ఈ దుర్మార్గంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సకల మాధ్యమాల్లో ఆగ్రహం, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఏడేండ్ల కిందటి ‘నిర్భయ’ (16 డిసెంబర్‌ 2012) ఘటన తర్వాత మళ్ళీ అలాంటి దారుణం ఏ మహిళా ఎదుర్కోకూడదనుకున్నాం. కానీ దారుణాల పరంపర కొనసాగుతూనే వుంది. ‘భయమేస్తోందం’టూ భీతి చెందిన కొన్ని గంటల్లోనే ప్రియాంక దుండుగుల దాడికి గురయి మంటల్లో కాలిపోవటం అందరి హృదయాల్ని కలచివేస్తున్నది. అలాగే వరంగల్‌లో ఇంటర్‌ విద్యార్థిని మానసపై ప్రేమించిన వ్యక్తే లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. ఇలాంటి ఘటనలు పెరగడం సమాజ పతనావస్థని సూచిస్తున్నది. ఆడపిల్లలు క్షణక్షణం బిక్కుబిక్కుమంటూ తమని తాము కూడదీసుకుంటూ బతకాల్సి రావడం ఏ నాగరికత ఫలశ్రుతి? ఏ అభివృద్ధికి కొలమానం?

మినహాయింపు కాదు
అభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఎదగాలనుకుంటున్న భారత దేశం మహిళలపై, బాలికలపై జరిగే లైంగిక దాడుల్లో, హత్యల్లో ప్రపంచంలోనే మూడో స్థానంలో వుంది. ఐతే మన ముందు ఓ ప్రశ్న తలెత్త వచ్చు. ఇలాంటి సంఘటనలు ఇతర దేశాలలో జరగటం లేదా? మన దేశంలోనేనా అని. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా మహిళల అణిచివేతలో కొద్దో గొప్పో తేడాలు ఉన్నాయే తప్ప ఏ దేశమూ మినహాయింపు కాదు. గతంలో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ప్రపంచ వ్యాప్తంగా 35 శాతానికి పైగా మహిళలు లైంగిక హింసకు గురవుతున్నారని ప్రకటించింది. యునైటెడ్‌ నేషన్స్‌ ఓ ప్రకటనలో అనేక దేశాలలో మహిళలపై లింగ వివక్ష, లైంగిక దాడులు తీవ్రమవుతున్నాయని, వాటిని అరికట్టాలని పేర్కొంది.

పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలు
కుటుంబంలో, పని ప్రదేశాలలో ఎక్కడైతేనేమి ఏదో రూపంలో వివక్ష ఉందనే చెప్పాలి. మన దేశంలో లైంగిక వేధింపులు, దాడులు, కిడ్నాప్‌లు, వరకట్న హత్యలు, మానసిక, శారీరక హింస అధికంగా ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తన నివేదికలో పేర్కొంది. అనేక సర్వేలు కూడా వెల్లడించాయి. రాబోయే ప్రమాదాన్ని గుర్తించిన సామాజిక వేత్తలు, మహిళా సంఘాలు ప్రభుత్వాలకు అనేక సూచనలను, సిఫార్సులు చేశారు. మన ప్రభుత్వాలు వాటిని పెడ చెవిన పెట్టాయి. జరుగుతున్న సంఘటనలు మన దేశ భవిష్యత్‌లో మహిళల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. .

అంతమొందించలేకపోతున్నాయి
ఇక చట్టాల విషయానికొస్తే సెక్సువల్‌ అఫన్సివ్‌ యాక్ట్‌ 2012, క్రిమినల్‌ లా అమాండ్మెంట్‌ యాక్ట్‌ 2013, నిర్భయ చట్టం -2013, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం -2013, లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం -2012, బాల్య వివాహ నిరోధక చట్టం -2006 ఇలా ఎన్నో చట్టాలు. ఐతే ఇవన్నీ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తున్నాయన్నది ప్రశ్న. గృహ హింస రక్షణ చట్టం నుండి మొదలు నిర్భయ చట్టం వరకు ఎన్ని చట్టాలు చేసినా వివక్షను అంతమొందిచలేకపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, బాలికల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశ పెట్టాయి. మాతా శిశు సంక్షేమ పథకాల నుండి బేటీ పడావ్‌ -బేటీ బచావ్‌ వరకు అమలులో ఎంతవరకు చిత్తశుద్ధి ఉన్నది, ఎంత వరకు ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నది మరో పెద్ద ప్రశ్న.

న్యాయం జరుగుతుందా?
మహిళలు, బాలికలపై జరుగుతున్న లైంగిక దాడుల కేసుల్లో నేర పరిశోధన దగ్గర నుండి శిక్షల వరకు అంతా లోపభూయిష్టంగానే వుంది. దీనికి కారణాలు ఎన్నో. వాస్తవానికి ఎన్నో ఘటనలు వెలుగులోకి రావడం లేదు. సామాజిక, కుటుంబ పరిస్థితుల రీత్యా బాధితురాలు ఫిర్యాదు చేయటమే గగనం. ఒకవేళ ఫిర్యాదు చేసినా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే దాఖలాలే లేవు. చట్టాలపై పూర్తి అవగాహన మహిళలకు లేకపోవటం, చట్టాలలోని లోపభూయిష్టతా, అమలులో చిత్త శుద్ధి లేకపోవటం ఇవన్నీ ప్రధాన కారణాలే. ఇక ప్రియాంక కేసులో మహిళా జాతీయ కమిషన్‌ ఓ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణకు సిద్ధమయింది. ఎంత వరకు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.
కాని జరిగే న్యాయం ఏమిటి? ప్రియాంకరెడ్డి తిరిగి రాదు. ఆమెలా మరొకరు పురుషాధిపత్య సమాజ క్రౌర్యానికి బలికాకుండా ఆపగలమా? ఆడవాళ్ళను విలాస వస్తువులుగా చూసే సమాజ రీతిని, నీతిని రూపుమాపగలమా? నేరస్థులకు శిక్ష పడటమే కాదు, మహిళలు స్వేచ్ఛగా, నిర్భయంగా, నిస్సంకోచంగా ప్రయాణించే, జీవించే పరిస్థితులు నెలకొల్పగలవా ఈ ప్రభుత్వాలు, వ్యవస్థలు? ఇవే అసలుసిసలు ప్రశ్నలు. వీటికి జవాబు చెప్పేదెవరు?

హింసాత్మక మెదళ్ళు మారాలి
భయమేస్తోంది… అంటోన్న ఆమె గొంతు నా గొంతులో దుఖఃపు శూలంలా గుచ్చుకొంటూనే వుంది. శత్రువు శత్రువుగా వొస్తే గుర్తు పట్టొచ్చేమో .. శత్రువు మిత్రునిగా వొస్తే హింసాత్మక వూబిలో చిక్కుకున్నట్టు కూడా తెలియదేమో…మనం వంద జాగ్రత్తలు తీసుకున్నా నూట వొకటో రూపంలో ప్రేమగానో, స్నేహంగానో, సహాయంగానో యెదురై వాళ్ళు మన ప్రాణరూపాన్నే అదృశ్యం చేసేంత సమర్థులు. యింత హింసాత్మక హృదయాలను యే మెటల్‌ డిటెక్టర్‌తో కనిపెట్టగలం.మనసు భయంతో హెచ్చరిస్తోన్న… పబ్లిక్‌ ప్లేస్‌లో వొంటరిగా నిలబడితే అంతా మనలనే చూస్తారు యెగాదిగా అనే బెరుకు…వొక్కటా రెండా యెన్నెన్ని చూపుల కర్కశాలని భరిస్తూ చేసే ప్రయాణాల్లో దుర్మార్గపు చూపుల చేతలకి శ్వాస ఆగిపోయిన ప్రతి సారీ మనకి యెన్నెన్నో జాగ్రత్తలు చెప్పడానికి అలాచెయ్యాల్సింది.. యిలా చేయాల్సింది అని బోలెడు సలహాలు యిచ్చేస్తూ బాధితురాలే ఆమె లోనైన హింసకు కారణం అన్న ధోరణిలో మాటాడటం మాని, అసలు యీ హింసాత్మక మెదళ్ళు యెలా మనుష్యులుగా మానవీయంగా మారాలో ఆలోచించి సూచిస్తే, ఆచరిస్తే బాగుండును.
కుప్పిలి పద్మ, ఫేస్‌బుక్‌ కామెంట్‌

మహిళగా పుట్టడం నేరమా?
అమాయకురాలైన ప్రియాంక రెడ్డిపై దాడి చేసి అనంతరం హత్య చేశారు. ఇది మానవాళిని కదిలించే ఓ విషాదకరమైన ఘటన. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి సిగ్గుపడతాయి. మన సమాజంలో ఒక మహిళగా పుట్టడం నేరమా?. ఈ అఘాయిత్యానికి పాల్పడిన వారిని వెంటనే శిక్షపడే విధంగా మనమందరం పోరాటం చేద్దాం.
అనుష్క

ప్రభుత్వం విఫలమయింది
ప్రతి గంటకు ఇద్దరు మహిళలు లైంగిక దాడులకు గురౌతున్నారు. దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతుంది. వీటిని అరికట్టాలంటే షీ టీమ్స్‌ ఇంకా పకడ్బందీగా అమలు చేయాలి. పెట్రోలింగ్‌ కూడా పెరగాలి. ముఖ్యంగా నగర శివార్లలో పెట్రోలింగ్‌ ఏర్పాటు చేయాలి. మారుమూల ప్రాంతాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పోలీసులు, న్యాయ వ్యవస్థ నేరస్థుల పట్ల ఉదాసీనతను విడనాడి మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి.
మల్లు లక్ష్మి, ఐద్వా రాష్ట్ర కార్యదర్శి

సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి..
ఈ ఘటన చాలా బాధాకరమైంది. ఇది నా కూతురు ప్రత్యూష ఘటననే గుర్తు చేస్తుంది. యువతులు, మహిళలు బయటికి వెళ్లినప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. మనం భయపడి ఎదుటి వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. మన జాగ్రత్తే మనల్ని కాపాడుతుంది. ప్రియాంక రెడ్డిపై దారుణానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలి. వాళ్లకి మరణశిక్ష పడితే మహిళాలోకం ఆనందిస్తుంది.
సరోజిని, ప్రత్యూష తల్లి

మహిళా సంక్షేమం కోసం…
ఎట్లా బతుకుతావ్‌? రోడ్లమీద, అభివృద్ధి పేరు మీద అప్పులు తెచ్చి మరీ ఖర్చు పెట్టే ప్రభుత్వాలు అందులో కొద్ది శాతం మహిళా సంక్షేమం కోసం పెట్టినా ఈ రోజు మన ఆడ పిల్లలని కాపాడుకొనే వాళ్లం. సమాజంలో అరాచకం పెరగడానికి ప్రభుత్వాలు, వాటిని సరి చేసుకోలేని మనమూ బాధ్యులమే. సామూహికంగా అందరం సిగ్గుపడాలి.|
సుజాత సూరేపల్లి

చైతన్యవంతమైన సమాజం కావాలి
రోజురోజుకు హింస పెరిగి పోతుంది. ఇలాంటివి చూడటానికే పేపర్‌ చదువుతున్నామా అనిపిస్తుంది. ఈ పురుషాధిక్య సమాజంలో ఆడదంటే కోర్కెలు తీర్చుకోడానికే పుట్టింది అనే భావన బలంగా వుంది. స్త్రీని వస్తువుగా చూసే ఈ ఘోరమైన ఆలోచన మారాలంటే సమాజంలో చైతన్యం వస్తే తప్ప అది సాధ్యం కాదు. సమస్య మూలాల్లోకి వెళ్ళి నివారించడానికి ప్రయత్నిస్తే కొంత కాలానికైనా మార్పు వస్తుంది. మానసిక పరివర్తన కలిగిన మనుషులు వున్నప్పుడు మాత్రమే అది సాధ్యం.
శిలాలోలిత, ప్రముఖ కవయిత్రి

Courtesy Nava telagnana …