• నాగర్‌ కర్నూల్‌ జిల్లా కుడికిళ్లలో భూసేకరణ సర్వే
  • తీవ్రంగా అడ్డుకున్న రైతులు
  • వరుసగా మూడోసారి నిర్వాసితులు
  • కల్వకుర్తి, భగీరథ, ఇప్పుడు ఎత్తిపోతలకు
  • మిగిలిన భూములిచ్చేది లేదన్న రైతులు
  • అర్ధరాత్రి 400 మంది పోలీసుల రాక
  • అదుపులోకి 40-50 మంది రైతులు
  • పోలీసు స్టేషన్‌కు తరలింపు
  • బండరాయితో బాదుకొని గాయపడ్డ అన్నదాత
  • మరొకరి ఆత్మహత్యాయత్నం
  • నాగర్‌కర్నూలు జిల్లాలో బలవంతపు భూసేకరణ సర్వే
అది నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడికిళ్ల గ్రామం! ఊళ్లో ఉన్నది 500కుపైగా గుమ్మాలు! బుధవారం అర్ధరాత్రి దాటాక 400 మందికిపైగా సాయుధ పోలీసులు వెళ్లారు! తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ఇళ్లపై దాడి చేశారు! 40-50 మందిని అదుపులోకి తీసుకున్నారు! వారిని కొల్లాపూర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు! ఆ వెంటనే రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు! భూ సేకరణ సర్వేకు సిద్ధపడ్డారు! మిగిలిన రైతులు దానిని తీవ్రంగా వ్యతిరేకించారు! మూడోసారి తమ భూములను లాక్కోవద్దని అభ్యంతరం తెలిపారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి! పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణలో అధికారులు, పోలీసుల దౌర్జన్య కాండ ఇది! కుడికిళ్లలోని రైతుల భూములను 2009లో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఒకసారి సేకరించారు. తమ భూములకు నీరు వస్తుందన్న ఆశతో అప్పట్లో రైతులు సహకరించారు. సాగునీరు రావడంతో సంతోషించారు. అనంతరం, మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా మరికొన్ని భూములను సేకరించారు. ఇప్పుడు వారికి కొన్ని భూములు మాత్రమే మిగిలాయి. ఉదాహరణకు, గతంలో ఐదెకరాలున్న రైతుకు ఇప్పుడు ఎకరన్నర, రెండెకరాలు మాత్రమే మిగిలాయి.
ఇప్పుడు అక్కడ ఎకరా 10-15 లక్షల వరకూ పలుకుతోంది. ఆ మిగిలిన భూములను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద సేకరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఎకరాకు రూ.5-.5.5 లక్షలు పరిహారంగా ఇస్తోంది. తమకు జీవనాధారంగా మారిన ఆ భూములను వదులుకోవడానికి రైతులు సిద్ధంగా లేరు. మరోసారి నిర్వాసితులుగా మారి సర్వస్వం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల 100 రోజులపాటు రిలే దీక్షలు కూడా చేశారు. భూ సేకరణ సర్వేను అడ్డుకోవడంతో అధికారులు, నిర్వాసితులకు మధ్య పలుసార్లు ఘర్షణ కూడా జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల పాలమూరు పథకం పనులను సందర్శించారు.
ఈ సందర్భంగా, కుడికిళ్ల, కార్కొండ గ్రామాల్లో భూసేకరణకు సంబంధించి తలెత్తుతున్న ఇబ్బందులను అధికారులు ప్రధానంగా ప్రస్తావించారు. ఆయన వెళ్లిన తర్వాత కుడికిళ్లలో భూసేకరణపై రెవెన్యూ, పోలీస్‌ యంత్రాంగం ఓ ప్రణాళిక రూపొందించుకుంది. ఇందులో భాగంగా బుధవారం రాత్రి కుడికిళ్లలోకి ప్రవేశించిన పోలీసులు భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను అదుపులోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. కుడికిళ్లకు చెందిన కుబేరుడు, వెంకటేశ్వర్‌రావు, లక్ష్మణ్‌రావు, బిచ్చయ్య, ఈశ్వర్‌, రాములు తదితరులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
అనంతరం, ఉదయం 8 గంటలకు దాదాపు 400 మంది సాయుధులైన పోలీసులు రెవెన్యూ అధికారులను వెంట పెట్టుకొని వచ్చారు. అంబులెన్స్‌, అగ్నిమాపక వాహనాన్ని కూడా వెంట తీసుకొచ్చారు. దీంతో భూ సేకరణలో తన 7 ఎకరాల పొలాన్ని కోల్పోతున్న మధు(34) అనే రైతు తన భూమిలో అడుగు పెడితే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. అయినా, అధికారులు సర్వే నిర్వహిస్తుండగా బండరాయితో తల బాదుకొని తీవ్రంగా గాయపడ్డాడు.
భూసేకరణను నిలిపివేయాలంటూ మరో రైతు అంజి(32) ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని బలవన్మరణానికి సిద్ధపడ్డాడు. శ్యామల అనే మహిళా రైతు తన పొలంలోనే స్పృహ తప్పి పడిపోయింది. రైతులను పోలీసులు చెదరగొట్టారు. తోపులాటలో కొందరు రైతులు గాయపడ్డారు. కుడికిళ్లలో భూ నిర్వాసితులను పరామర్శించేందుకు వచ్చిన డీసీసీ అధ్యక్షుడు వంశీకృష్ణ, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నిర్బంధాన్ని ఎత్తేయాలి: తమ్మినేని
హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కుడికిళ్ల గ్రామాన్ని పోలీసులు దిగ్బంధించారని, రైతులతోపాటు తమ పార్టీ నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. రైతుల భూములను ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందన్నారు. ఇప్పటికే తక్కువ పరిహారం ఇచ్చి 300 ఎకరాలు లాక్కున్నారని, మరో 280 ఎకరాల భూసేకరణకు పావులు కదుపుతోందని ఆరోపించారు. రైతులపై నిర్బంధాన్ని ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు.

 

(COURTECY ANDHRA JYOTHI)