– కర్నాటకలో పెత్తందార్ల దాడి
– యూపీలో బిర్యానీ అమ్ముతున్నాడనీ..

దళితులపై ఆధిపత్యవర్గాలు చేస్తున్న అరాచకాలు ఆగటంలేదు. దేశంలో ఎక్కడో చోట వారిని టార్గెట్‌ చేస్తూనే ఉన్నారు. తాజాగా రెండు ఘటనల్లో దళితులపై దౌర్జన్యం చేశారు. కర్నాటకలో బైక్‌ తగిలిందని దళితకాలనీకి వెళ్లి ఓ యువకునిపై దాడి చేశారు. యూపీలో బిర్యానీ అమ్ముతున్న మరో దళితునిపై పెత్తందార్లు చేయిచేసుకున్నారు.

బెంగళూరు: ఓ దళిత యువకుడు తమ వర్గానికి చెందిన వ్యక్తికి బైక్‌ తాకించాడనే ఆగ్రహంతో పెత్తం దార్లంతా దళితకాలనీలోకి వె ళ్లి, రాళ్లతో దాడిచేశారు. ఈ దాడిలో ఇద్దరు గాయపడగా, కాలనీలోని పలు ఇండ్లు ధ్వంసం చేశారు. ఈ ఘటన కర్నాటకలోని మైసూర్‌ నగరా నికి దగ్గర్లో ఉన్న సాలెగ్రామంలో చోటుచేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రు అనే దళిత యువ కుడు బుధవారం రోజు బైక్‌పై వెళ్తుండగా, పెత్తందారీ వర్గా నికి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తికి ప్రమాదవశాత్తు బైక్‌ తగిలింది. ఆ సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాస్‌ సన్నిహితులు చంద్రును బెదిరించారు. అంతటితో ఆగకుండా చంద్రుపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. ఈ వివాదం ఇంతటితో ముగిసిపోయిందనుకునేలోపే, పెత్తందారీ వర్గానికి చెందిన ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎస్‌.ఆర్‌ మహేశ్‌ సోదరుడు, వందలమంది ఎమ్మెల్యే అనుచరులతో పాటు శ్రీనివాస్‌.. అంబేద్కర్‌ కాలనీలోకి ప్రవేశించి, రాళ్లతో దళితుల ఇండ్లపై దాడులు చేశారు. షాపులను బలవంతంగా మూసివేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలవ్వగా, ఇండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడుల సమయంలో ఇండ్లలో ఉన్న దళితులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. దీనికి సంబంధించి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో, ఎమ్మెల్యే సోదరుడు, శ్రీనివాస్‌ సహా 17మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, గతనెలలో ఇక్కడ ఓ కూడలి వద్ద అంబేద్కర్‌ విగ్రహం పెట్టాలని నిర్ణయించిన దళిత సంఘాలు.. అందుకు సంబంధించిన అనుమతులన్నీ తీసుకుని కూడలి వద్దకు వచ్చేలోపు పెత్తందార్లంతా అక్కడ మరో రాజకీయ నేత విగ్రహం పెట్టారని పోలీసులు తెలిపారు. అప్పట్నుంచీ దళితులపై ఈ అరాచకాలు మరింత ఎక్కువయ్యాయని దళిత నేతలు తెలిపారు.

దళితుడివి బిర్యానీ అమ్ముతాడా..
బిర్యానీ అమ్ముతున్న ఓ దళితుడిపై కొందరు దుండగులు దాడి చేసిన ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్‌ బుద్ధా నగర్‌ జిల్లా రబాపురా ప్రాంతంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్‌ (43) అనే దళితుడు బతుకుదెరువు కోసం ఓ తోపుడు బండిపై స్థానికంగా బిర్యానీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన నలుగురు పెత్తందార్లు కార్లో ఆయన దగ్గరికి వచ్చి, ‘ నువ్వో దళితుడివి, తినే పదార్థాలు అమ్ముతావురా’ అంటూ కులం పేరుతో దూషిస్తూ.. ఆయనపై దాడి చేశారు. అంతటితో ఆగకుండ ఆహారపదార్థాలను రోడ్డుపై విసిరేసి, బండిని ధ్వంసం చేశారు. బాధితుడి ఫిర్యాదుమేరకు పలుసెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టనున్నట్టు తెలిపారు. కాగా, దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌ అయ్యింది

Courtesy Nava telangana…