ఐఎన్ఎక్స్ మీడియా ముడుపుల కేసులో మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నెల 19 వరకూ ఆయన్ను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశించింది. మొత్తం 14 రోజులు ఆయన జైలులో గడుపుతారు. కుమారుడు కార్తి గతంలో ఉన్న జైలు నెంబర్ ఏడుకు చిదంబరాన్ని తరలించారు. తనకు ప్రత్యేక గది, బాత్‌రూమ్ కేటాయించాలని, జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ కల్పించాలని చిదంబరం కోరారు.
కేసు పూర్వాపరాలు  
పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీకి చెందిన ఐఎన్‌ఎక్స్‌ మీడియా సంస్థకు చిదంబరం కుమారుడు కార్తికి వ్యాపార సలహాదారు. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ఇంద్రాణీ ఐఎన్‌ఎక్స్‌ కేసులో 26 శాతం వాటా అమ్మకానికి అనుమతి కోరారు. కానీ ఎఫ్‌ఐపీబీ తొలుత ఆమె దరఖాస్తును తిరస్కరించింది. చిదంబరం కూడా రూ 4.62 కోట్ల మేర వాటా అమ్మకానికే అనుమతినిచ్చారు. ఆ సమయంలో కార్తి ఓ బేరం పెట్టారు. ‘విదేశాల్లోని తన సంస్థలకు చెల్లింపుల్లో సాయపడితే ఈ డీల్‌ కుదరుస్తానన్నది ఆ ప్రతిపాదన. ఇందుకు పీటర్‌ ఒప్పుకున్నారు. మనీ లాండరింగ్‌ ద్వారా ఎంత మొత్తాన్ని తరలించిందన్నది ఇంద్రాణీ వెల్లడించకపోయినా దాదాపు రూ. 300 కోట్ల మేర చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. తర్వాత కార్తిని ఇంద్రాణీ ఓ స్టార్‌ హోటల్లో కలిసి 10 లక్షల డాలర్ల మేర చెల్లించడానికి చర్చలు జరిపారు. చివరకు రూ 3.5 కోట్ల చెల్లింపుకు ఒప్పందం కుదిరింది. ముఖర్జీ దంపతులు ఆ మొత్తాన్ని కార్తి చిదంబరానికి సింగపూర్‌లో ఉన్న సంస్థ అడ్వాంటేజ్‌ సింగపూర్‌కు బదలాయించారు. ఈ వివరాలన్నింటినీ ఇంద్రాణీ సీబీఐ దర్యాప్తులో బయటపెట్టేశారు. అప్రూవర్‌గా మారారు. ముఖ్యంగా చిదంబరం పాత్రను, ఆయనతో తన భేటీలను ఆమె సవివరంగా తేదీలతో సహా వివరించారు.

(COURTECY ANDHRA JYOTHI)