• న్యూయార్క్‌లో 9/11 తర్వాత అత్యధిక మరణాలు
  • అంత్యక్రియలకూ రెండు వారాలు ‘వెయిటింగ్‌’
  • వెంటిలేటర్లకూ కరువు.. 90% అమెరికన్లు లాక్‌డౌన్‌లోనే!

బతుకు ఒక సమస్య. చావు మరింత సమస్య! చావు బతుకుల మధ్య పోరాడుతున్న వారికి పెను సమస్య! అగ్రరాజ్యం అని అంతా చెప్పుకొనే అమెరికా… ‘మా ఒక్క పౌరుడి ప్రాణం తృతీయ ప్రపంచ దేశాలకు చెందిన పది మంది ప్రాణాలతో సమానం’ అని భావించే అమెరికా… ఇప్పుడు తీవ్ర మానవీయ సంక్షోభంలో చిక్కుకుంటోంది. చనిపోయిన తర్వాత… తగిన మర్యాదలతో అంతిమ వీడ్కోలు పలికేందుకూ ఎదురు చూపులే!

న్యూయార్క్‌ : ఫోన్‌ రింగ్‌ అయ్యింది! చేసే వారెవరో తెలియకపోవచ్చు! కానీ… ఎందుకు చేస్తున్నారో మాత్రం తెలుసు! ‘‘మా ఇంట్లో ఒక మరణం! మృతదేహాన్ని తీసుకొస్తున్నాం! అంత్యక్రియలకు సిద్ధం చేయగలరా!’’…. ఇదే ఆ ఫోన్‌కాల్‌ సారాంశం! అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉన్న దాదాపు అన్ని ‘అంత్యక్రియల సేవల’ (ఫ్యునరల్‌ హోమ్‌) కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. మరణించిన వారిని  పూర్తి గౌరవ మర్యాదలతో సాగనంపడం పద్ధతి. ఆ బాధ్యతను ‘ఫ్యునరల్‌ హోమ్‌’లకు అప్పగిస్తారు. అక్కడ మృతదేహానికి స్నానం చేయించి, దుస్తులు తొడిగి, చక్కగా తయారు చేస్తారు. ఆ తర్వాత సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహిస్తారు. కరోనా వైరస్‌ కారణంగా నగరంలో దాదాపు 1400 మంది మరణించారు. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో… ఫ్యునరల్‌ హోమ్స్‌పై ఒత్తిడి తీవ్రంగా పెరిగింది. ‘‘ఒకేసారి 60 కేసులను డీల్‌ చేయగలం. గురువారం ఏకంగా 185 మృతదేహాలను అంత్యక్రియలకు సిద్ధం చేయాల్సి వచ్చింది. ఇదో అత్యవసర పరిస్థితి’’ అని బ్రూక్లిన్‌లోని ఓ ఫ్యునరల్‌ హోమ్‌కు చెందిన ప్యాట్‌ మార్మో తెలిపారు. దాదాపు అన్ని ఫ్యునరల్‌ హోమ్స్‌ నిర్వాహకులు అదనంగా శీతల గదులను సిద్ధం చేసుకుంటున్నారు. శ్మశాన వాటికలపైనా ఒత్తిడి తీవ్రమైంది. తమ వంతు కోసం వారం, ఒక్కోసారి రెండు వారాలు వేచి చూడాల్సి వస్తోంది. అంత్యక్రియల సేవలు, శ్మశాన వాటికలపై ఈ స్థాయిలో ఒత్తిడి పెరగడం ‘సెప్టెంబరు 11’ దాడుల తర్వాత ఇదే మొదటిసారి. శ్మశాన వాటికల్లో మృతుల బంధు మిత్రులు గుమికూడకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. కుటుంబ సభ్యులనే లోపలికి అనుమతిస్తున్నారు.

ఊపిరినిచ్చే వెంటిలేటర్లకూ కరువు
ఆస్పత్రుల్లో చావు బతుకుల్లో ఉన్న వారికి ఊపిరినిచ్చేందుకు వెంటిలేటర్లు లేని పరిస్థితి అమెరికాలో తలెత్తింది. కరోనా తీవ్రత నేపథ్యంలో వెంటిలేటర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అన్ని రాష్ట్రాలకు 2వేల మిలిటరీ వెంటిలేటర్లను పంపిస్తామని ‘పెంటగాన్‌’ రెండు వారాల కిందట ప్రకటించింది. ఇప్పటికి… వెయ్యి కూడా సరఫరా చేయలేకపోయింది. దేశవ్యాప్తంగా 9వేల వెంటిలేటర్లు కావాల్సి ఉందని అంచనా.

లక్ష ‘బాడీ బ్యాగ్‌’లు
కరోనాతో రాబోయే మరణాలను ఎదుర్కొనేందుకు ట్రంప్‌ సర్కారు సిద్ధమవుతోంది. యుద్ధాలు, దూర ప్రాంతాల్లో సైనికులు మరణించినప్పుడు… వారి మృతదేహాలను తరలించే గోతాలు (బాడీ బ్యాగ్‌) పౌరులకు ఉపయోగించాలని నిర్ణయించింది. లక్ష బాడీ బ్యాగులను కొనుగోలు చేస్తున్నట్లు ‘బ్లూమ్‌బర్గ్‌’ వార్తా సంస్థ తెలిపింది. ‘నాలుగు వారాలు ఇంటి నుంచి బయటికి రావొద్దు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించండి’ అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పిలుపునిచ్చారు.

కొలువు ‘క్లోజ్‌’
కరోనా దెబ్బకు అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలకుతలమవుతోంది. అమెరికాలో దాదాపు 90 శాతం మంది ఇళ్లకే పరిమితమయ్యారు. పరిశ్రమలు, కార్యాలయాలు, స్టోర్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య కార్యకలాపాలన్నీ ‘కోజ్‌’!  రెండు  వారాల్లో కోటి మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోయారు.

Courtesy Andhrajyothi