• నిధులలేమితో అవస్థలు
  • అరకొర సిబ్బందితో నడుపుతున్న వైనం

విద్యా కుసుమాలను వికసింపజేసిన నగర విజ్ఞాన కేంద్రాలు నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. నగర చరిత్రను తన పేజీల్లో పదిలంగా దాచుకున్న గ్రంథాలయాలు కనీస సౌకర్యాలు లేక కళాహీనంగా మారాయి. విజ్ఞాన భాండాగారాలుగా ఉండాల్సిన గ్రంథాలయాలు స్టడీ మెటీరియల్స్ లేక వెలవెలబోతున్నాయి. ప్రముఖ గ్రంథాలయాలు మినహా మిగతావాటి గురించి నగరవాసులకు తెలియదంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా నగరవాసుల నుంచి గ్రంథాలయాల పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ వాటి అభివృద్దికి మాత్రం ఖర్చు చేయడం లేదు. నిధుల లేమితో నగర గ్రంథాలయాలు కునారిల్లుతున్నాయి.

దిన పత్రికలకే పరిమితం..

ప్రస్తుతం చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంతో పాటు అఫల్గంజ్లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయాలు ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి. నగరంలోని మిగతా గ్రంథాలయాలు ఉన్నా… లేనట్టుగానే నడుస్తున్నాయి. పలు గ్రంథాలయాలు పేపర్ పాయింట్లుగా మారిపోయాయి. కొన్ని పేపర్లు మినహా ఎలాంటి ఇతర సదుపాయాలు, పుస్తకాలు అక్కడ ఉండవు. పుస్తక ప్రియులతోపాటు పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులు చదువుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

నగరవాసుల నుంచి పన్ను వసూలు..

ఏటా వసూలు చేసే ఆస్తి పన్నులో జీహెచ్ఎంసీ.. లైబ్రరీ సెస్ పేరుతో పన్నును వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేసిన ఆదాయాన్ని గ్రంథాలయాలకు నిధులుగా వెచ్చించాలి. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. గతేడాది జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను ద్వారా సుమారు రూ.1300 కోట్లు వసూలు చేసింది. ఇందులో 8శాతం లైబ్రరీ సెస్గా నగరవాసుల నుంచి వసూలు చేసింది. లెక్కప్రకారం రూ.104కోట్లు నగరంలోని గ్రంథాలయాల అభివృద్దికి వెచ్చించాలి. కానీ జీహెచ్ఎంసీ ఆ నిధులను గ్రంథాలయాలకు ఇవ్వడం లేదని సిబ్బంది చెబుతున్నారు. రాష్ట్ర విద్యాశాఖ గ్రంథాలయ ఉద్యోగులకు జీతభత్యాలు, దిన, వార, మాస పత్రికలు కొనుగోలు చేసేందుకు నిధులను విడుదల చేస్తోంది. ఈ నిధుల ఆధారంగానే నగరంలోని గ్రంథాలయాలు నడుతుస్తున్నాయి.

కుర్చీలు లేవు..

నగర కేంద్ర గ్రంథాలయం పరిధిలో 86 గ్రంథాలయాలుండగా ఇందులో 80 మాత్రమే పనిచేస్తున్నాయి. చిక్కడపల్లిలోని కేంద్ర గ్రంథాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేక బయట నుంచి తెచ్చుకుంటున్నారు. దీంతో వందల మంది అభ్యర్థుల చదువులు చెట్ల కిందే సాగుతున్నాయి. వేలాది మంది ప్రతిరోజూ ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తారు. సీనియర్ సిటిజన్లతో మొదలుకొని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు, ఇతర సందర్శకులు ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. ప్రతిరోజూ ఇలా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు నగరంలో అనేకమున్నాయి. రూ.150 చెల్లించి నగర కేంద్ర గ్రంథాలయంలో సభ్యత్వం తీసుకున్నవారి సంఖ్య ఇప్పటి వరకు 2లక్షలకు చేరింది. రోజూ సగటున వెయ్యి మంది వరకు గ్రంథాలయాన్ని సందర్శిస్తుండగా ఇక్కడి నిర్వహణ, పుస్తకాల కొనుగోలు, ఇతరాలకు చాలా మొత్తంలో ఖర్చువుతుంది. కానీ గ్రాంట్ల రూపంలో కేవలం రూ.15లక్షలు మాత్రమే విడుదల అవుతోందని సిబ్బంది చెబుతున్నారు.

సిబ్బంది లేరు…

నగరంలోని చాలా గ్రంథాలయాల్లో తగినంత సిబ్బంది లేరు. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో 50 మందికి కేవలం 18. మంది మాత్రమే పని చేస్తున్నారు. రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగిలిన చిన్నా చితకా గ్రంథాలయాల పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. నగరంలో శాశ్వత ఉద్యోగులు 85 మంది ఉండగా సుమారు 40మంది తాత్కాలిక ఉద్యోగులు పని చేస్తున్నారు.

ఈ- లైబ్రరీల సంగతేంటి…?

నగరంలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటయ్యేలా దాదాపు 500 ప్రాంతాల్లో ఈ-లైబ్రరీలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. సుమారు రెండు లక్షల వ్యయంతో ఒకటి లేక రెండు కంప్యూటర్లు, వాటికి ఇంటర్నెట్ సౌకర్యం, ఫర్నీచర్ సమకూర్చాలని, వివిధ భాషలకు చెందిన వార్తా పత్రికలు, మ్యాగజైన్లు కొనుగోలుకు నెలకు రూ.2వేల వరకు చెల్లించాలని నిర్ణయించారు. వీటిద్వారా నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు తదితరులకు ఈ-లైబ్రరీలు ఉపయోగకరంగా ఉంటాయని అంచనా వేశారు. మొదటిదశలో 500 ప్రాంతాల్లో ఏర్పాటుచేయాలని జీహెచ్ఎంసీ నిర్ణయించినా నేటికీ కసరత్తు సాగుతూనే ఉంది. ఈ-లైబ్రరీల ఏర్పాటు మాత్రం ఆమడదూరంలో ఉంది.

కొత్త పుస్తకాలు కొనే పరిస్థితి లేదు…

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన పుస్తకాలు, నవలలు చదవాలని గ్రంథాలయానికి వస్తే నిరాశే ఎదురవుతోందని సభ్యత్వం తీసుకున్నవారు చెబుతున్నారు. గత ఐదేళ్ల నుంచి కొత్త పుస్తకాలు కొనడం లేదని నిధులు సరిగా అందకపోవడంతో అవసరమైన మేరకు మాత్రమే పుస్తకాలను కొంటున్నట్లు సిబ్బంది సమాధానమిస్తున్నారు. 2014 నుంచి కొత్త పుస్తకాలను కొనడం లేదని, పోటీ పరీక్షల అభ్యర్థులకు అవసరమయ్యే పుస్తకాలను డిమాండ్ దృష్ట్యా కొనుగోలు చేస్తున్నట్టు సిబ్బంది తెలిపారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ నేతృత్వంల మరో ఇద్దరు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రూపొందించి, ప్రస్తావించే అంశాల ఆధారంగానే కొత్త పుస్తకాల కొనుగోలుకు నిధులు, ఇతర సమస్యల పరిష్కారం జరగనుందని గ్రంథాలయ సిబ్బంది చెబుతున్నారు.

(COURTECY EENADU)