కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేయడంతో ఉపాధి అవకాశాలకు తీవ్రస్థాయిలో గండిపడనుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.5 కోట్ల మంది ఉద్యోగాలకు ముప్పు ఏర్పడే అవకాశముందని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ ఓ) ప్రకటించింది. అయితే అంతర్జాతీయ సహకార విధానాల ద్వారా ఈ సంఖ్యను తగ్గించుకోవచ్చని సూచించింది. ‘కోవిడ్-19 అండ్ వరల్డ్ ఆఫ్ వర్క్: ఇంపాక్ట్స్ అండ్ రెస్పాన్స్’ పేరుతో అంచనా నివేదికను తయారు చేసింది. ఈ ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయంగా 8,600 నుంచి 3.4 లక్షల కోట్ల డాలర్ల వరకు ఆదాయాన్ని కార్మికులు కోల్పోయే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

విద్యార్థులకు తీవ్ర నష్టం
ప్రపంచానికి అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్ పెద్ద ముప్పుగా మారిందని యునెస్కో ప్రకటించింది. కోవిడ్-19ను పెను సవాల్ గా వర్ణించింది. కరోనా వైరస్ కారణంగా విద్యార్థి జనాభాలోని సుమారు సగం మంది అంటే 85 కోట్ల వరకు స్టూడెంట్స్ విద్యాలయాలకు దూరమయ్యారని వెల్లడించింది. పాఠశాలలను మూసివేసిన నేపథ్యంలో స్వయంప్రభ డీటీహెచ్ చానళ్ల ద్వారా విద్యార్థులకు ఈ-తరగతులను నిర్వహిస్తామని భారత ప్రభుత్వం ప్రకటించింది. మార్చి నెలలో 60 శాతం మంది రైలు ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారని పార్లమెంటరీ కమిటీకి రైల్వే అధికారులు తెలిపారు. అటు విమానయాన సంస్థలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయి.

టూరిజానికి దెబ్బ
కరోనా కలకలంతో భారత పర్యాటక రంగం భారీగా దెబ్బతింది. 70 శాతం మేర నష్టపోయే అవకాశముందని కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ విస్తరణతో ఇప్పటివరకు 95 శాతం చిన్న, మధ్యతరహా పరిశ్రమలు దెబ్బతిన్నాయని.. దీంతో 2.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, 2 కోట్ల మంది పరోక్షంగా ఉపాధి కోల్పోయారని తెలిపింది.