ట్రాక్‌ చేసిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు
పాతనగరంలో కరోనాపై అప్రమత్తం
అసద్‌తో మాట్లాడిన కేసీఆర్‌, కేటీఆర్‌, ఈటల
వ్యాధి విస్తరించకుండా చొరవకు విజ్ఙప్తి

హైదరాబాద్‌ : కరోనా విస్తరించకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ప్రధానంగా హైదరాబాద్‌ పాతనగరంపై దృష్టి సారించింది. అక్కడ రెండు కుటుంబాలకు, మరోచోట ఓ కుటుంబానికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో.. పాతనగరానికి చెందిన ఆ రెండు కుటుంబాలు ఎవరెవరిని కలిశాయో తేల్చేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం రంగంలోకి దిగింది. వారు దాదాపు 400 మందిని కలిసినట్లు గుర్తించింది. వైద్య ఆరోగ్య శాఖతో కలిసి వారిని హోంక్వారంటైన్‌ చేస్తోంది.

నిజాం హయాంలో హైదరాబాద్‌ రాష్ట్రం తరఫున ఢిల్లీలో నిర్మించిన ఓ ప్రార్థన మందిరానికి వెళ్లివచ్చాకే.. ఆ రెండు కుటుంబాలు కరోనాబారిన పడ్డట్లు గుర్తించింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన ఓ ఏజెంట్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా ఈ నెల 10న ఆ ప్రార్థన మందిరానికి వెళ్లారు. ఆయన 17న తిరిగిరాగా.. కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలింది. కాగా.. పాతనగరంలో కరోనా విస్తరించకుండా చూసేందుకు సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయనతోపాటు.. మంత్రులు కేటీఆర్‌, ఈటల పాతనగరంపై దృష్టి సారించారు. మజ్లిస్‌ అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ,  ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌తో వారు మాట్లాడారు. పాతనగరంలో కరోనా కట్టడికి వారు కూడా చొరవ తీసుకోవాలని అభ్యర్థించారు. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి ఇళ్లలో పనిచేసిన పనిమనుషులపైనా నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. వారి వివరాలు సేకరించి, వారు ఎవరెవరిని కలిశారో గుర్తిస్తున్నాయి.

Courtesy Andhrajyothi