• నిబంధనలకు విరుద్ధంగా 18 వేలకు పైగా సీట్ల పెంపు
 • గత బోర్డు కార్యదర్శి హయాంలో యథేచ్ఛగా అనుమతులు
 • ఉపకార వేతనాల పేరిట అడ్డగోలు దోపిడీ
 • ఐదేళ్లలో రూ.100 కోట్లు అన్యాక్రాంతం
 • ప్రస్తుత బోర్డు కార్యదర్శి నివేదిక
 • సక్రమ సీట్లకే సర్కారు తాజా అనుమతి

మూత్రపిండాల వైఫల్య రోగులకు రక్తశుద్ది(డయాలసిస్) ముఖ్యమైన చికిత్స. ఈ చికిత్సలో వైద్యుడితో పాటు సాంకేతిక సహాయకుడి పాత్ర కీలకం. ఇది చేయాలంటే ‘డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సును రెండేళ్ల పాటు అభ్యసించి, అనుభవపూర్వక శిక్షణ పొందడం అనివార్యం. ఈ కోర్సు నిర్వహించడానికి ఐదేళ్ల కిందట దేవరకొండలోని ఓ పారామెడికల్ కళాశాలకు అనుమతించారు. ఆ ప్రాంతాల్లో అసలు రక్తశుద్ధి కేంద్రాలే అందుబాటులో లేవు. మరి విద్యార్థికి అనుభవపూర్వక శిక్షణ ఎలా లభ్యమవుతుంది? కోర్సు పూర్తయిన అనంతరం వారు రోగులకు రక్తశుద్ధి చికిత్సను ఎలా అందించగలుగుతారు? రాష్ట్రంలోని కొన్ని పారామెడికల్ కళాశాలల్లో కోర్సుల నిర్వహణకు, అక్రమాలకు ఈ ఉదాహరణ ఓ మచ్చుతునక.

పారామెడికల్ కళాశాలల్లో బయటపడుతున్న ఆక్రమాలు అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. 2014-15 విద్యా సంవత్సరంలో నిబంధనలకు విరుద్దంగా వేర్వేరు పారామెడికల్ కళాశాలల్లో ఏకంగా 18,896 సీట్లను పెంచుతూ అప్పటి పారామెడికల్ బోర్డు కార్యదర్శి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్తగా కళాశాలల నిర్వహణకు పచ్చజెండా ఊపడమే కాకుండా.. ఇష్టానుసారంగా కోర్సులు, అదనంగా సీట్లను కూడా పెంచడంపై ప్రస్తుత పారామెడికల్ బోర్డు కార్యదర్శి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేశారు. ప్రభుత్వం అవకతవకలు జరిగినట్లుగా, ఉపకార వేతనాల పేరిట దోపిడీ జరిగినట్లుగా అంచనాకు వచ్చింది. ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.18వేల చొప్పున ప్రభుత్వం పారామెడికల్ కళాశాలలకు ఉపకార వేతనమందిస్తోంది. ఈ లెక్కన గత ఐదేళ్లలో సుమారు రూ.100 కోట్ల మేరకు నిధులు

అక్రమాలు బయటపడింది ఇలా..

నాలుగేళ్ల కిందట పొందిన అనుమతుల పునరుద్దరణకు తిరిగి ఆయా కళాశాలలు ఇటీవల పారామెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవడంతో ఈ అక్రమ అనుమతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నాటి అనుమతుల్లో అవకతవకలపై ప్రస్తుత బోర్డు కార్యదర్శి సమర్పించిన నివేదికను పరిశీలించిన ప్రభుత్వం.. కేవలం సర్కారు నుంచి అనుమతులు పొందిన కళాశాలలు, కోర్సులు, సీట్లు మాత్రమే ఈ ఏడాది కొనసాగించాలని తాజాగా నిర్ణయించింది. దీంతో ఏకంగా 18వేలకు పైగా సీట్లకు ఈ ఏడాది కోత పెట్టింది. పారామెడికల్ బోర్డులోనూ సంస్కరణలు తీసుకురానున్నారు. ఇప్పటి వరకూ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, కళాశాలల తనిఖీ ప్రక్రియలు జరుగుతుండగా.. వీటిని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరిధిలోకి తీసుకురావాలని ప్రాథమికంగా తీర్మానించింది.

నిబంధనలివీ..

 • పారామెడికల్ కళాశాలను నెలకొల్పాలంటే.. ఆ అవసరాన్ని గుర్తిస్తూ ముందుగా ఉన్నత స్థాయి కమిటీ (హై పవర్ కమిటీ) ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి.
 • అనంతరమే ప్రభుత్వం కొత్తగా కళాశాలలకు అనుమతిస్తుంది. ఆ ప్రకారమే పారా మెడికల్ బోర్డు ముందుకెళ్లాలి.
 • ఈ విధానం కొత్తగా కోర్సులను పెంచుకోవడానికి, అదనంగా సీట్లను మంజూరు చేయడానికి కూడా వర్తిస్తుంది.

ఉల్లంఘనలిలా..

 • ఉన్నత స్థాయి కమిటీ ఎంపీ హెచ్ఏ కోర్సును కొన్ని కళాశాలలకు మాత్రమే అనుమతించిందని, తమకు అనుమతివ్వలేదని పేర్కొంటూ 2009లో మరికొన్ని ప్రైవేటు కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.
 • ఈ కళాశాలలకు కూడా ఆ కోర్సును అనుమతించాలని న్యాయస్థానం 2012లో తీర్పు చెప్పింది.
 • ఇక్కడే అప్పటి పారామెడికల్ బోర్డులో అక్రమాలకు తెరలేచింది.
 • వాస్తవానికి న్యాయస్థానం ఆదేశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ అనుమతితోనే ఆయా ప్రైవేటు కళాశాలలకు గుర్తింపు ఇవ్వాలి. ఈ ప్రక్రియకు తూట్లు పొడవడంతో నిబంధనలకు నీళ్దలడం ప్రారంభమైంది.
 • కేవలం ఎంపీ హెచ్ఏ కోర్సుకు, అది కూడా తమను ఆశ్రయించిన కళాశాలలకు మాత్రమే అనుమతించాలని కోర్టు పేర్కొనగా.. 2014-15లో కళాశాలల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఇష్టానుసారంగా కళాశాలల్లో సీట్లకు, కొత్త కోర్సులకు కూడా పారామెడికల్ బోర్డు కార్యదర్శి అనుమతించారు.
 • ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా 63 కొత్త కళాశాలలకు గుర్తింపునిచ్చారు.
 • అనుమతి ఉన్న కళాశాలల్లోనూ ఒక్కోదాంట్లో 5-10 కోర్సుల వరకూ కూడా అక్రమంగా అనుమతించారు.
 • ప్రభుత్వం ఒక కళాశాలకు ఒక కోర్సుకు 10-20 సీట్లకు అనుమతిస్తే .. ఈ సంఖ్యను 40-60 సీట్లకు అడ్డగోలుగా పెంచారు.
 • ఏటా పరీక్షల నిర్వహణ, కళాశాల నిర్వహణ కూడా లోపభూయిష్టంగా ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
 • కనీస మౌలిక సదుపాయాలు, శిక్షణకు అవసరమైన ఏర్పాట్లేవీ లేకుండానే కళాశాలలు నిర్వహిస్తున్నట్లుగా అంచనాకు వచ్చింది.
 • కొన్ని కళాశాలలు బోర్డుతో కుమ్మక్కై గత కొన్నేళ్లుగా ముందస్తుగానే పరీక్ష పత్రాలను పొందడం.. మార్కులను తారుమారు చేయడం వంటివి చేస్తున్నాయనే ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి.

ఇదో ఉదాహరణ…

ఛాతీకి కోత పెట్టి.. గుండెకు శస్త్రచికిత్స చేయాల్సిన సందర్భాల్లో గుండె-ఊపిరితిత్తుల పరికరం(హార్ట్-లంగ్ మిషన్)’ నిర్వహణ చాలా కీలకం. గుండె చేయాల్సిన పనిని ఈ పరికరమే చేస్తుంది. ఆ పరికరం నిర్వహణ బాధ్యత పర్ ఫ్యూజన్ టెక్నీషియన్ది. ఈ కోర్సులో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ చికిత్సలో భాగస్వాములవుతారు. ఆదిలాబాద్ కు 16 కి.మీ. దూరంలో ఉండే ఒక మారుమూల గ్రామంలో ఉన్న పారామెడికల్ కళాశాలకు ‘డిప్లొమా ఇన్ పర్ ఫ్యూజన్ టెక్నాలజీ కోర్సుకు ఐదేళ్ల కిందట అనుమతించారు. ఇక్కడికి దగ్గరలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే పరిస్థితే లేదు. అలాంటప్పుడు ఇంత ముఖ్యమైన కోర్సును ఇక్కడ అభ్యసించిన విద్యార్థులు ఆ చికిత్సకు ఎలా న్యాయం చేయగలుగుతారు? ఈ కళాశాలకు సర్కారు అనుమతి ఒక్క ‘మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఎంపీహెచ్ఏ)’ కోర్సుకు మాత్రమే ఉండగా.. దీనికి విరుద్దంగా 10 కోర్సులు అదనంగా అనుమతించారు.